అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు కొండ వద్ద నిర్మిస్తున్న పోలవరం జలవిద్యుత్కేంద్రంలో ఫెరోల్స్ ఏర్పాటు పనులను ఏపీజెన్‌కో ఎస్‌ఈ శేషారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలవిద్యుత్కేంద్రంలో ఇప్పటికే 12 ప్రెజర్ టన్నెళ్ల తవ్వకాలు పూర్తయ్యాయని తెలిపారు. ఒక్కో టన్నెల్‌లో 52 ఫెరోల్స్ చొప్పున 12 టన్నెల్స్‌లో 624 ఫెరోల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. జలవిద్యుత్కేంద్రం సొరంగాల్లో నీరు సక్రమంగా వెళ్లేందుకు ఇవి తోడ్పడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మేఘా ఇంజినీరింగ్ సంస్థ సీజీఎం ముద్దు కృష్ణ, డీజీఎం క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోలవరంలో స్పిల్ వే పనులు పూర్తి : పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్ వే పనులు పూర్తయ్యాయని మేఘా ఇంజినీరింగు సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. స్పిల్ వేలో గేట్ల నిర్వహణకు అవసరమైన హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పూర్తయింది. ఈ ప్రాజెక్టులో మొత్తం 48 రేడియల్ గేట్లు ఉంటాయి. జర్మనీ నుంచి తీసుకొచ్చిన సిలిండర్ల అమరిక పూర్తి చేశారు. మొత్తం 48 గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు ఏర్పాటుచేశారు. గేట్ల నిర్వహణకు అవసరమైన 24 పవర్‌ప్యాక్ సెట్ల ఏర్పాటు పూర్తయింది. పది రివర్ స్లూయిజ్ గేట్ల ఏర్పాటుతోపాటు వీటికి అవసరమైన 20 హైడ్రాలిక్ సిలిండర్లు ఏర్పాటుచేశారు.
ఇదీ చదవండి: POLAVARAM: పోలవరంపై ఎత్తిపోతల నిర్మాణం.. మీ ఇష్టమొచ్చినట్లుగా నిర్మాణాలు సాధ్యం కాదు