భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ చరిత్ర సృష్టించింది. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. పారాలింపిక్స్ చరిత్రలోనే టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఆదివారం జరిగిన క్లాస్-4 టేబుల్ టెన్నిస్ ఫైనల్ మ్యాచ్‌లో చైనా ప్లేయర్ యింగ్ ఝోపై 0-3తో ఓడి.. రజతం సొంతం చేసుకుంది.
అంతకుముందు జరిగిన సెమీస్‌లో చైనా క్రీడాకారిణి మియావో జాంగ్‌తో పోటీ పడిన భవీనా.. ఆమెను 3-2తో చిత్తుచేసింది.
ఇదీ భవీనా నేపథ్యం..
భవీనా బెన్ పటేల్.. గుజరాత్‌లోని మహేసాణాకు చెందినది. అయిదేళ్ల కిందటే 2016 రియో పారాలింపిక్స్‌కు ఆమె ఎంపికైంది. కానీ సాంకేతిక కారణాల వల్ల పోటీల్లో పాల్గొనలేకపోయింది. అయినా భవీనా పట్టుదల వీడలేదు. టోక్యోలో అడుగుపెట్టింది. ఇక్కడ తొలి మ్యాచ్‌లోనే ఓడినా ఆమె ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. ఎందుకంటే ఇలాంటి అడ్డంకులు.. ఒడుదొడుకులు.. ప్రతికూల పరిస్థితులు.. ఆమెకు చిన్నప్పటి నుంచే అలవాటు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన భవీనా పోలియో కారణంగా బాల్యంలోనే చక్రాల కుర్చీకి పరిమితమైంది. తన స్నేహితులందరూ గెంతులేస్తూ ఆడుతుంటే తాను మాత్రం నడవలేకపోతున్నానని బాధ పడేది. ఆ సమయంలో కుటుంబం తనకు అండగా నిలిచింది.
భవీనా తండ్రి 2004లో ఆమెను అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్‌లో చేర్పించాడు. అక్కడే ఆమె టీటీ కెరీర్‌కు అంకురార్పణ జరిగింది. ఫిట్‌నెస్ కోసం సరదాగా టీటీ ఆడడం మొదలెట్టి ఆటపై ప్రేమ పెంచుకుంది. మూడేళ్ల పాటు తీవ్రంగా కష్టపడి జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. మొత్తం మీద పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన రెండో భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఓడినా ర్యాంకింగ్స్‌లో తనకంటే మెరుగైన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
భవీనా స్వస్థలంలో సంబరాలు
టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన భవీనా స్వస్థలమైన గుజరాత్‌లోని మహేసాణాలో గ్రామస్థులు సంబరాలు జరుపుకొంటున్నారు. బాణసంచా కాలుస్తూ.. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.