Wrestlers Protest : భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న దేశపు అత్యుత్తమ మల‌్లయోధులు.. తమ పోరాటం ఆపేదిలేదని స్పష్టంచేశారు. తాము ఇప్పటివరకు సాధించిన పతకాలను గంగానదిలో పారేసి.. ఇండియా గేట్ వద్ద ఆమరణ దీక్ష చేస్తామని.. ప్రకటించారు. ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ ఈ మేరకు ట్వీట్ చేశారు.
మంగళవారం(మే 30) సాయంత్రం హరిద్వార్ వెళ్లి గంగానదిలో పతకాలను విసిరేస్తామని సాక్షి తెలిపింది. సాధించిన పతకాలు తమ జీవితమని పేర్కొన్న ఆమె.. వాటిని విసిరేసిన తర్వాత తమకిక జీవించడానికి.. ఏమీ మిగిలి ఉండదన్నారు. అందుకే ఇండియా గేట్ వద్ద మరణించేవరకూ దీక్ష చేపడతామని పేర్కొన్నారు. అదే ట్వీట్‌ను వినేష్ ఫొగాట్ షేర్ చేశారు. కాగా, ఆదివారం పార్లమెంటు భవనం వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధం అవ్వగా.. వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే దీక్ష కోసం ఇకపై జంతర్ మంతర్ వద్దకు అనుమతించబోమని దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆదివారం నాటి పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. రెజ్లర్లు ఈ కీలక ప్రకటన చేశారు.