Roger Federer Announces Retirement : దిగ్గజ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే వారం జరగనున్న లావర్ కప్ తనకు చివరి ఏటీపీ ఈవెంట్ అని ట్విట్టర్లో వెల్లడించాడు 41 ఏళ్ల స్విస్ దిగ్గజం. 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచి దిగ్గజ ఆటగాడిగా కీర్తి గడించాడు రోజర్. కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న ఫెదరర్.. 2021 జులైలో జరిగిన వింబుల్డన్ తర్వాత ఏ టోర్నీలోనూ ఆడలేదు. గ్రాండ్‌స్లామ్‌ల్లో ఒకటైన యూఎస్ ఓపెన్ ముగిసిన కొద్దిరోజులకే ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసి అభిమానులకు షాకిచ్చాడు ఫెదరర్. 310 వారాల పాటు టెన్నిస్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడిగా ఉన్నాడు. తన 24 ఏళ్ల కెరీర్లో 1500కుపైగా మ్యాచ్‌లు ఆడానని చెప్పుకొచ్చాడు.
ఇటీవల జరిగిన యూఎస్ ఓపెన్ తనకు చివరిదని ఇప్పటికే ప్రకటించింది అమెరికా టెన్నిస్ స్టార్, దిగ్గజం సెరెనా విలియమ్స్. కానీ టైటిల్ గెలవలేకపోయింది. 23 గ్రాండ్‌స్లామ్ విజయాలతో ఓపెన్ శకంలో సింగిల్స్‌లో (మహిళలు, పురుషులు కలిపి) అత్యధిక టైటిళ్లు గెలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన సెరెనాకు ఓ లోటు మిగిలిపోయింది. టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో ఉన్న మార్గరెట్ కోర్ట్‌ను (24) అందుకోవాలన్న ఆమె కల తీరలేదు. ఇప్పటివరకు మహిళల సింగిల్స్‌లో 23, డబుల్స్‌లో 14, మిక్స్‌డ్ డబుల్స్‌లో 2 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు, నాలుగు ఒలింపిక్ స్వర్ణాలతో శిఖరాగ్రానికి చేరుకుంది సెరెనా.
సెరెనా తర్వాత అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన వారిలో ప్రస్తుతం స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్(22), సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్(21) వరుసగా ఉన్నారు.