ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022 ప్రారంభం కానుంది. దాదాపు 28 రోజలుపాటు జరిగే మెగా టోర్నీ కోసం ఇప్పటికే జట్లన్నీ తీవ్రంగా సాధన చేస్తూ ఉన్నాయి. ఎనిమిది వేదికల్లో 32 జట్లు టైటిల్ కోసం పోరాడతాయి. అభిమానులు కూడా భారీగానే చేరుకొన్నారు. తమ అభిమాన జట్టు మ్యాచ్‌ను వీక్షించాలనే ఆశతో వచ్చిన వారికి ఆహార ధరలను చూసి దిమ్మతిరిగే షాక్ తగిలింది. మ్యాచ్‌లను చూస్తూ ఖతార్‌లో ఆనందంగా గడుపుదామని వచ్చిన వారు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఆహార ధరలను చూసి కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు యూకే మీడియా పేర్కొంది. ఎందుకంటే గ్రీక్ సలాడ్‌ను 9 పౌండ్లు (దాదాపు రూ.900), చిప్స్ వంటి స్నాక్ ఫుడ్ 4.60 పౌండ్లు (దాదాపు రూ. 500), చికెన్ క్యూసడిల్లాస్ (పిజ్జాలో ఓ రకం), పెప్పర్ పిజ్జా కూడా ఎనిమిదేసి పౌండ్లు (దాదాపు రూ. 800) ఉంది. ధరకు తగ్గట్టుగా ఆహారం నాణ్యంగా లేదని, తాము అనుకొన్న విధంగా లేవని అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అదేవిధంగా ఇటాలియన్ ఐస్‌క్రీమ్‌ను తిందామంటే దాదాపు రూ. 2,800 (29 పౌండ్లు) వెచ్చించాల్సి ఉందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హోరెత్తించారు. ఇక పోలిష్ కాఫీ రూ. 3,300 (34 పౌండ్లు), వెజిటబుల్ చీజ్‌బర్గర్ రూ. 3,800 (38 పౌండ్లు), అర లీటర్ బీర్ కావాలంటే మాత్రం రూ. 1,100 (11.50 పౌండ్లు), చిన్న బర్గర్ రూ. 500 ( 5 పౌండ్లు) వెచ్చించాలి. ఇక ఆహారం గురించి ఓ నెటిజన్ స్పందిస్తూ.. "నా పెంపుడు కుందేళ్లకు ఇంతకంటే మంచి సలాడ్‌ను అందిస్తా".. "ఇది తప్పకుండా అత్యంత చెత్త ప్రపంచకప్ పోటీలుగా నిలుస్తాయి" అని మరో యూజర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నవంబర్ 20న ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య తొలి మ్యాచ్‌తో ఫిఫా ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
అక్కడ బీర్ అమ్మకాలు బంద్.. అతిథ్య దేశ అధికారులు, ఫిఫా కమిటీ మధ్య జరిగిన చర్చల అనంతరం ఫిఫా ప్యాన్ ఫెస్టివల్, ఇతర ప్రాంతాలు, లైసెన్స్‌డ్ వేదికలు, స్టేడియాల పరిసర ప్రాంతాల్లోని బీర్ సేల్స్ పాయింట్లను తొలగించాలని నిర్ణయించినట్లు ఫిఫా వెల్లడించింది. నాన్ ఆల్కహాలిక్ ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. మైదానాల్లో, వెలుపల అభిమానులు ఆనందంగా గడిపేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: బోల్డ్‌గా స్టార్ క్రికెటర్ పిక్ వైరల్.. రణ్వీర్ న్యూడ్ ఫొటోకు లేటెస్ట్ వెర్షనా?