PV Sindhu Canada Open : కెనడా ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్య సేన్ దూసుకెళ్తున్నారు. ఆటలో తమదైన స్టైల్లో రాణించిన ఈ ప్లేయర్స్.. పోటీల్లో నెగ్గి క్వార్టర్ ఫైనల్స్ వైపుకు అడుగులేశారు. గురువారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో సింధుకు వాకోవర్ లభించింది. జపాన్ స్టార్ నత్సుకి నిదైర గాయంతో తప్పుకోవడం వల్ల మ్యాచ్ ఆడకుండానే సింధు విజేతగా నిలిచింది. ఈ క్రమంలో సింధు తన ప్రత్యర్థైన జపాన్‌కు చెందిన నట్సుకి నిదైరాపై గెలుపు సాధించగా..రానున్న మ్యాచ్‌లో సింధు.. 2022 ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ గావో ఫాంగ్ జీతో తలపడనుంది.
ఇక బుధవారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సింధు 21-16, 21-9తో కెనడా ప్లేయర్ తాలియాపై విజయం సాధించి ప్రిక్వార్టర్స్ చేరుకుంది. 36 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించడం వల్ల.. గేమ్ ఏకపక్షంగా ముగిసింది. అయితే కెనడా ప్లేయర్ తాలియా ఏ దశలోనూ సింధుకి పోటీ ఇవ్వలేకపోయింది. డ్రాప్ షాట్లు, సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్‌లతో సింధు దూసుకుపోగా.. ప్రత్యర్థి ఆ తాకిడికి తేలిపోయింది. కాగా, రుత్విక శివాని 12-21, 3-21తో థాయ్‌లాండ్‌కు చెందిన సుపనిడా కటెథోంగ్ చేతిలో ఓడి పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస గేమ్‌ల్లో చిత్తయ్యింది.
అటు సింధు.. ఇటు సేన్..
Lakshya Sen Canada Open : మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత యువ కెరటం లక్ష్యసేన్ సంచలన విజయాని అందుకున్నాడు. లక్ష్య్ సేన్ 31 నిమిషాల్లో బ్రెజిల్‌కు చెందిన యోగోర్ కొయెల్హోపై 21-15, 21-11 తేడాతో విజయాన్ని అందుకున్నడు. ఇంతకుముందు ఈ టోర్నిలో థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్కు లక్ష్యసేన్ ఊహించని షాకిచ్చాడు. తొలి రౌండ్లో సేన్ 21-18, 21-15తో రెండో సీడ్ కున్లావత్‌ను ఓడించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. కున్లావుత్‌పై ఆడి తన రికార్డును 4-5తో మెరుగుపరుచుకున్నాడు.
ఇక రెండు గేమ్‌ల్లో కున్లావత్‌కు లక్ష్యసేన్ తనదైన స్టైల్లో ఆడి చుక్కలు చూపించాడు. మెరుగైన ఆటతో ప్రత్యర్థికి చెమటలు పట్టేలా చేశాడు. తిరుగులేని బేస్‌లైన్ గేమ్‌తో ప్రత్యర్థిని ఓడించి మరీ ప్రీక్వార్టర్‌కు దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్‌లో వైగర్‌తో లక్ష్యసేన్ పోటీపడనున్నాడు. అతనిపై లక్ష్యసేన్‌కు 3-0తో మెరుగైన రికార్డు ఉంది. మరో మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 12-21, 17-21తో వైగర్ కోలో (బ్రెజిల్) చేతిలో ఓటమి పాలయ్యాడు.