ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలివన్డేలో 6 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా.. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను వెనక్కి నెగ్గి మొదటి ర్యాంక్ దక్కించుకున్నాడు.
ఐసీసీ వన్డే బౌలింగ్ విభాగంలో రెండేళ్లు అగ్రస్థానంలో కొనసాగిన బుమ్రా 2020 ఫిబ్రవరిలో మొదటి ర్యాంక్ కోల్పోయాడు. మళ్లీ ఇప్పుడు అగ్రపీఠం అధిరోహించాడు. మొత్తంగా 730 రోజులు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో నంబర్-1 ర్యాంక్‌లో కొనసాగి ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా ఖ్యాతినార్జించాడు. గతంలో టీ20ల్లో కూడా నంబర్-1 బౌలర్‌గా ఉన్న బుమ్రా ప్రస్తుతం టెస్టుల్లో మూడో ర్యాంక్‌లో ఉన్నాడు.
కపిల్ దేవ్ తర్వాత.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచిన భారత రెండో ఫాస్ట్ బౌలర్ బుమ్రా కావడం గమనార్హం. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో మూడు వికెట్లతో సత్తా చాటిన షమీ మూడు ర్యాంకులు ఎగబాకి.. భువనేశ్వర్ కుమార్‌తో కలిసి 23వ స్థానాన్ని పంచుకున్నాడు.
టాప్10లో ఉన్నది వీరే..: .1.జస్‌ప్రీత్ బుమ్రా(భారత్), 2.ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్), 3.షాహిన్ ఆఫ్రిది(పాకిస్థాన్), 4.జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), 5.ముజీబ్ ఉర్ రెహమాన్(అఫ్గనిస్థాన్), 6.మెహెదీ హసన్(బంగ్లాదేశ్), 7.క్రిస్ వోక్స్(ఇంగ్లాండ్), 8. మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్), 9.మహ్మద్ నబీ(అఫ్గనిస్థాన్), 10. రషీద్ ఖాన్(అఫ్గనిస్థాన్).
టీ20లో ఐదో స్థానానికి సూర్య..
ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో సెంచరీతో అదరగొట్టిన సూర్యకుయార్ యాదవ్ ఐసీసీ ర్యాంకింగ్స్ తన కెరీర్లో అత్యుత్తమ స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో 44 ర్యాంకులు ఎగబాకి.. ఐదో స్థానంలో నిలిచాడు. సూర్య మొత్తం 732 పాయింట్లు సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి 212 స్ట్రైక్‌రేటుతో 117 పరుగులతో అదరగొట్టాడు సూర్య. సూర్య మినహా మరే ఇతర భారత బ్యాటర్‌కు టాప్-10లో చోటు దక్కలేదు.
టాప్10లో ఉన్నది వీరే..: 1.బాబర్ ఆజమ్(పాకిస్థాన్), 2. మహ్మద్ రిజ్వాన్(పాకిస్థాన్), 3.ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా), 4. డేవిడ్ మలన్(ఇంగ్లాండ్), 5. సూర్యకుమార్ యాదవ్( భారత్), 6.ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా), 7. డెవాన్ కాన్వే(న్యూజిలాండ్), 8.నికోలస్ పూరన్(వెస్టిండీస్), 9.పాథుమ్ నిశాంక(శ్రీలంక), 10. మార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్), రసీ వాన్ డెర్ డసెన్(దక్షిణాఫ్రికా)
ఇదీ చదవండి: కేఎల్ రాహుల్‌తో పెళ్లి.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్