ASIAN CHAMPIONS HOCKEY TROPHY: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సెమీస్‌లో ఓడిన భారత జట్టు తిరిగి పుంజుకుంది. నేడు(బుధవారం) మూడో స్థానం కోసం హోరాహోరీగా జరిగిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలుపొంది కాంస్య పతకాన్ని అందుకుంది. 4-3 తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. భారత్ తరఫున వైస్‌కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్(1వ నిమిషంలో), సుమిత్(45వ ని.), వరుణ్ కుమార్(53వ ని.), ఆకాశ్‌దీప్ సింగ్(57వ ని.) ఒక్కో గోల్ చేశారు. పాక్‌కు అఫ్రజ్, అబ్దుల్ రానా, అహ్మద్ నదీమ్ ఒక్కో గోల్ అందించారు. అంతకుముందు మంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత్.. జపాన్ చేతిలో 3-5 తేడాతో ఓడిపోయింది. దీంతో కాంస్యం కోసం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో తొలి నుంచి భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. వరుసగా నాలుగు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా ఒకదానినే గోల్‌గా మలిచారు. తొలి క్వార్టర్ ముగిసే సరికి భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
అయితే వెంటనే పుంజుకున్న పాకిస్థాన్ పదకొండో నిమిషంలో (అర్ఫ్రాజ్) గోల్ చేసి స్కోరును 1-1 సమం చేసింది. మూడో క్వార్టర్ (33వ నిమిషం) ప్రారంభంలోనే పాక్ ప్లేయర్ అబ్దుల్ గోల్ కొట్టడంతో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 45వ నిమిషం వద్ద సుమిత్ గోల్‌తో మళ్లీ స్కోరు (2-2) సమమైంది. వరుణ్ కుమార్ (53వ నిమిషం), ఆకాశ్ దీప్ (57వ నిమిషం) వరుసగా గోల్స్ సాధించడంతో భారత్ 4-2తో విజయం వైపు దూసుకెళ్లింది. అయితే ఆఖర్లో పాక్ గోల్స్ చేసినా ఆధిక్యం తగ్గించగలిగిందే కానీ.. విజయం సాధించలేకపోయింది. దీంతో చివరికి భారత్ 4-3 తేడాతో సూపర్ విక్టరీని నమోదు చేసి కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇదీ చూడండి: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓటమి