WTC Final 2023 IND VS AUS : వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో మూడు రోజుల ఆట అయింది. ఈ ఫైనల్లో మొదటి రెండు రోజులు కంగారు జట్టు ఆధిపత్యం ప్రదర్శించగా.. మూడో రోజు ఆటలో మాత్రం భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. అయినప్పటికీ మ్యాచ్‌లో కంగారూలదే పైచేయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 296 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక నాలుగో రోజు ఆటలో రాణించి 400 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించేలా కనిపిస్తోంది. కాబట్టి ఛేదన భారత్‌కు కఠిన సవాల్ అనే చెప్పాలి. దీంతో మనోళ్లకు గెలిచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
Oval highest Run Chase In Tests : ఓవల్ స్టేడియం రికార్డులను పరిశీలిస్తే... అద్భుతాలు జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ మైదానంలో అత్యధిక ఛేదన 263 మాత్రమే ఉంది. అది కూడా చాలా కాలం.. 121 ఏళ్ల కింద. ఆస్ట్రేలియా జట్టుపై ఇంగ్లాండ్ టీమ్ సాధించింది. కానీ ఇప్పుడు కంగారు జట్టు ఆధిక్యం ఇప్పటికే 296కు చేరుకుంది. ఇంకా ఆ టీమ్ చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. దీంతో లక్ష్యం 350 నుంచి 400కు చేరువయ్యే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి.
మరో విషయమేమిటంటే.. ఈ మైదానం వేదికగా జరిగిన 104 టెస్టు మ్యాచుల్లో 26 సార్లు మాత్రమే నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించిన జట్లు విజయాన్ని సాధించాయి. కాబట్టి ఈ ఫలితాలు చూస్తుంటే.. నాలుగో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమనే అనిపిస్తోంది. అంటే డబ్ల్యూటీసీ ట్రోఫీని ముద్దాడే విషయంలో మళ్లీ నిరాశే ఎదురవచ్చు. ఒకవేళ చివరి రెండు రోజుల్లో, రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే కానీ.. భారత్ ఓటమిని తప్పించుకోవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
గబ్బా రిపీట్ అవుతుందా?(Gabba test 2021).. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో.. రహానే నేతృత్వంలోని గబ్బా టెస్టు(నాలుగో మ్యాచు)లో భారత్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ భారత్ ఒత్తిడిని జయించి చారిత్రక విజయాన్ని అందుకుంది. కంగారు జట్టు విధించిన 329 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి మరి మ్యాచ్‌ను గెలిచింది. అయితే అప్పుడు రిషబ్ పంత్ (89*), శుభ్‌మన్ గిల్(91) , పుజారా (56) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు.
ఇక ప్రస్తుత డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడు రోజుల్లో 296 పరుగులతో ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. నాలుగో రోజు ఆటలో 350 నుంచి 400 పరుగులు చేసే అవకాశం ఉంది. అయితే ఈ నాలుగు రోజు ఆటలో టీమ్‌ఇండియా బౌలర్లు విజృంభించి 330-340 పరుగులలోపు ఆలౌట్ చేస్తే.. భారత్‌కు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆటకు ఇంకో రోజున్నార వరకు సమయం ఉంటుంది. గబ్బాలోలాగా టీమ్‌ఇండియా బ్యాటర్లు మెరుగైన ప్రదర్శనతో కాస్త నిలకడగా ఆడితే.. విజయాన్ని అందుకోవచ్చు.