తొలి మహిళల ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్న మహిళా క్రికెటర్లు.. మైదానంలో అద్భుతాలు చేస్తున్నారు. ఆదివారం గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచే అందుకు ఉదాహరణ. ఓడిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకున్న యూపీ జట్టు.. గుజరాత్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో యూపీ బ్యాటర్ కిరణ్ నవ్‌గిరె అర్ధశతకంతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
అయితే.. ఆట కంటే కూడా ఆమె పట్టుకున్న బ్యాట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అంతలా ఆ బ్యాట్ ప్రత్యేకత ఏంటంటే.. దానిపై క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ పేరు చేతితో రాసి ఉండటమే. కిరణ్ నవ్‌గిరె బ్యాట్‌పై ఎలాంటి స్పాన్సర్ లేబుళ్లు లేవు. దానికి బదులుగా ఆమె MSD 07 అని రాసుకుంది. ఆదివారం నాటి మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఓ కామెంటేటర్ దాన్ని గుర్తించారు. దీంతో ఆమె బ్యాట్ ఫొటో ఇప్పుడు వైరల్ అయ్యింది.
మ్యాచ్ అనంతరం కిరణ్ మాట్లాడింది. "2011లో టీమ్‌ఇండియా పురుషుల జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు అంతటా ఒకటే పేరు మార్మోగింది. ఆయనే మహేంద్ర సింగ్ ధోనీ. అప్పటి నుంచి నేను ఆయన అభిమానిగా మారిపోయా. ఆ సమయంలో మహిళల క్రికెట్ అనేది ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. పురుషుల క్రికెట్ చూస్తూ పెరిగాను. ధోనీలాగా సిక్స్‌లు కొట్టాలన్న ఒకటే ఆలోచనతో క్రికెట్ నేర్చుకున్నా "అని మాజీ సారథిపై తన అభిమానాన్ని బయటపెట్టింది.
ఇక, మహారాష్ట్రకు చెందిన కిరణ్ నవ్‌గిరె భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. మహిళల సీనియర్ టీ20 ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సాధించింది. టీ20 మ్యాచ్‌లో 150కి పైగా స్కోరు సాధించిన ఏకైక భారత క్రికెటర్ ఈమనే. 2022లో జరిగిన మహిళల సీనియర్ టీ20 ట్రోఫీలో నాగాలాండ్ తరఫున ఆడిన కిరణ్.. అరుణాచల్‌పై 76 బంతుల్లో 162 పరుగులు చేసింది.