Under-19 Women's T20 World Cup: మహిళా క్రికెట్‌ను మరో మెట్టు ఎక్కించేందుకు అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహిస్తోంది ఐసీసీ. 2023లో జరగనున్న ఈ తొలి టీ20 మెగా టోర్నీని దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్నట్లు తాజాగా ఐసీసీ వెల్లడించింది. ఇందులో 16 జట్లు పాల్గొననుండగా.. తొలి టోర్నీలోనే విశ్వవిజేతగా నిలిచేందుకు టాప్ జట్లతో పాటు చిన్న జట్లు సైతం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి.
అండర్-19 ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్‌ను ముందుగా 2021లోనే నిర్వహించాలని నిర్ణయించింది ఐసీసీ. అయితే.. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ మెగా టోర్నీని వాయిదా వేసింది ఐసీసీ. ఏప్రిల్ 10న జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ టోర్నీ నిర్వహించే కొత్త తేదీలను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ ఈవెంట్లో మొత్తం 41 మ్యాచ్‌లు ఉండనుండగా.. వచ్చే ఏడాది జనవరిలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది ఐసీసీ.
రెండు నెలల్లో రెండు మెగా టోర్నీలు: ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ సైతం 2023 ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. అది కూడా దక్షిణాఫ్రికాలోనే నిర్వహిస్తుండటం విశేషం. అంటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండు ఐసీసీ మెగా టోర్నీలకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు టోర్నీలను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫొలెట్సి మొసెకి. ' ఇది చాలా అద్భుతమైన విషయం. దక్షిణాఫ్రికాపై ఐసీసీ పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈమెగా టోర్నీలను విజయవంతంగా పూర్తి చేసేందుకు అందరి సమన్వయంతో కృషి చేస్తాం. అండర్-19 ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.' అని పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా మహిళల క్రికెట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ కప్-2022లో అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా. ఈ టోర్నీలోని కొన్ని ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు అభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ టోర్నీలో భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమించటం అభిమానుల్లో కాస్త నిరాశను కలిగించింది.
ఇదీ చూడండి: మహిళా క్రికెట్‌కు కొత్త వన్నెలు తెచ్చిన సారథులు