Rajkumar Sharma on Kohli: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ దేనికీ ఆశపడడని.. ఆటకు వంద శాతం న్యాయం చేస్తాడని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అన్నారు. కొద్దిరోజులుగా భారత క్రికెట్‌లో కోహ్లీకి, బీసీసీఐకి మధ్య వివాదం ముదురుతోంది. కోహ్లీ వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో ఇరు పక్షాల మధ్య భిన్న స్వరాలు వినిపించడం వల్ల అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కోహ్లీ చిన్ననాటి కోచ్.. విరాట్ ఒక్కసారి మైదానంలోకి దిగితే ఈ విషయాలన్నీ మర్చిపోతాడని చెప్పారు. అతడు అంకితభావంతో క్రికెట్ ఆడతాడని స్పష్టం చేశారు.
"ఈ వివాదం కోహ్లీ బుర్రలో ఎక్కడో ఓ మూలన ఉంటుంది. కానీ, ఒక్కసారి బరిలోకి దిగితే అవన్నీ మర్చిపోతాడు. ఇదంతా అతడి ఆటను దెబ్బతీస్తుందని నేను అనుకోను. అతడికి అమితమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాగే ఆటకు వంద శాతం న్యాయం చేస్తాడనే నమ్మకం కూడా ఉంది. ఏ ఆటగాడికైనా ఇలాంటి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. అయితే, ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ.. బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరిస్తుందని భావిస్తున్నా. ఇలాంటి అనవసర రద్ధాంతం టీమ్‌ఇండియాలో ఉండకూడదని నేను అనుకుంటున్నా" అని రాజ్‌కుమార్ పేర్కొన్నారు.
అలాగే ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన రాజ్‌కుమార్.. కోహ్లీ వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో వారి మధ్య సమన్వయలోపం లేకుండా ఉండాల్సిందని అన్నారు. అసలేం జరిగిందనే విషయంపై ఇరువురి మధ్య పారదర్శకత ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.