Virat Kohli Test Captaincy: విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి ముగింపు పలకడం టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. కోహ్లీ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో క్రికెట్ అభిమానులు షాక్‌కి గురయ్యారని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం కోహ్లీ కెప్టెన్సీకి ముగింపు పలికాడు. దీంతో అతడు అన్ని ఫార్మాట్లలో సారథ్యాన్ని వదులుకొన్నట్లయింది.
'విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీని వదిలేయడం.. టీమ్ఇండియాపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటో అతడికే తెలియాలి. కీలక ఆటగాడైన కోహ్లీనే అభద్రతా భావంలో ఉంటే.. మిగిలిన ఆటగాళ్ల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే, దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే అతడు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం.. వన్డే సిరీస్‌లో భారత్‌ని దెబ్బ తీసిందనుకుంటున్నాను. ఏదేమైనా దక్షిణాఫ్రికాను సొంత గడ్డపై ఓడించే గొప్ప అవకాశాన్ని టీమ్‌ఇండియా కోల్పోయింది. మన జట్టు కంటే బలహీనంగా ఉన్న సఫారీ జట్టు చేతిలో దారుణఓటమి మూటగట్టుకొంది. ఏబీ డివిలియర్స్, డుప్లెసిస్, డేల్ స్టెయిన్, జాక్వెస్ కలిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు లేకున్నా దక్షిణాఫ్రికా సిరీస్ సాధించిందంటే.. భారత్ ఎలాంటి స్థితిలో ఉందో అంచనా వేయవచ్చు' అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
భారీ అంచనాలతో దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరిన టీమ్‌ఇండియా ఖాళీ చేతులతో తిరిగొచ్చింది. మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలికాడు. స్వల్ప వ్యవధిలోనే వన్డే సిరీస్‌లో పాల్గొనడం, అదే సమయంలో కోహ్లీ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం భారత ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం చూపింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీతో.. కేఎల్ రాహుల్ వన్డే సిరీస్‌కు సారథ్యం వహించాడు. 0-3 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది.
త్వరలో వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చూడండి: ఫిట్నెస్ టెస్ట్‌లో హిట్‌మ్యాన్ పాస్.. విండీస్‌తో సిరీస్‌కు రెడీ