టీమ్ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీకి తాను రుణపడి ఉన్నానని హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. కెరీర్, జీవితంలో ఒడుదొడులు ఎదుర్కొన్నప్పుడు తనకు అండగా నిలిచాడని పేర్కొన్నాడు. తండ్రి చనిపోయిన బాధలో ఆస్ట్రేలియాలో ఏడుస్తున్నప్పుడు తనను కౌగిలించుకొని ఓదార్చాడని వెల్లడించాడు. ప్రస్తుతం అతడు ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్నాడు.
"నీకు సామర్థ్యం ఉంది.. ఏ వికెట్‌పై అయినా ఆడగల సత్తా ఉంది. ఎలాంటి బ్యాటర్‌నైనా పెవిలియన్ పంపించగలవు.. అని విరాట్ భయ్యా ఎప్పుడూ అంటాడు. ఆస్ట్రేలియా సిరీసు సమయంలో మా నాన్న చనిపోయారు. నేను కన్నీటిలో మునిగిపోయాను. ఆలోచించే పరిస్థితుల్లో లేను. అప్పుడు విరాట్ నా గదికి వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నాకు అండగా నిలిచాడు. నా కెరీర్, జీవితంలో ప్రతి దశలో విరాట్ భయ్యా నాకు మద్దతిచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాకోసం ఉంటాడు. హోటల్ గదిలో నేనెంతగా ఏడ్చానో నాకు గుర్తుంది. నేను నీతో ఉన్నాను. ఆందోళన చెందకని ఓదార్చాడు. అతడి మాటలు నాకు ప్రేరణనిచ్చాయి. ఆ పర్యటనలో అతనాడింది ఒక్క టెస్టు అయినా సందేశాలు, ఫోన్‌కాల్స్‌తో నాలో స్ఫూర్తి నింపాడు. ఈ మధ్యే సీఎస్కే మ్యాచ్ తర్వాత విరాట్ భయ్యా నాతో మాట్లాడాడు. నా బౌలింగ్‌లో చేసుకున్న మార్పులు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. జట్టుకు అవి ఉపయోగపడతాయని తెలిపాడు. ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధంగా ఉండమన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ సారథుల్లో ఒకరి నుంచి అలాంటి మాటలు వస్తే ఎంతో ప్రేరణ కలుగుతుంది."
-సిరాజ్, టీమ్ఇండియా పేసర్.
టీమ్ఇండియా త్వరలోనే రెండు జట్లుగా విడిపోయి ఇంగ్లాండ్, శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ ఫైన్ల్(జూన్ 18-22), ఇంగ్లాండ్ సిరీస్(ఆగస్టు 4-సెప్టెంబరు 14), శ్రీలంక సిరీస్‌లో జులైలో నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: బుమ్రా, చాహర్‌కు కరోనా టీకా తొలి డోసు