మహిళా సీనియర్ క్రికెటర్ల కాంట్రాక్ట్ గ్రేడ్లను బీసీసీఐ ప్రకటించింది. 17 మంది మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్ జాబితాలో చోటు కల్పించింది. అయితే, ఆయా క్రికెటర్లకు చెల్లించే వేతన వివరాలను మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. కేవలం మూడు గ్రేడ్‌లకు సంబంధించి పేర్లను ప్రకటించింది.
ఏ గ్రేడ్: భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ. టాప్ గ్రేడ్‌లో ఈ ముగ్గురు మాత్రమే చోటు దక్కించుకున్నారు. గతేడాది వీరికి కాంట్రాక్ట్ ప్రకారం రూ.50 లక్షలు వార్షిక వేతనంగా చెల్లించారు. ఈసారి ఆ మొత్తం పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
బీ గ్రేడ్: ఐదుగురు ప్లేయర్లకు బీ గ్రేడ్ దక్కింది. టాప్ పేసర్ రేణుకా సింగ్, బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్‌లకు బీ గ్రేడ్ దక్కింది. గతేడాది బీ గ్రేడ్ క్రికెటర్లు ఏడాదికి రూ. 30 లక్షలు పొందారు.
సీ గ్రేడ్: మొత్తం తొమ్మిది మంది ప్లేయర్లను సీ గ్రేడ్ జాబితాలో చేర్చింది బీసీసీఐ. తెలుగు క్రికెటర్లు సబ్బినేని మేఘన, అంజలి సర్వాని చోట ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించారు. మేఘ్నా సింగ్, దేవికా వైద్య, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యస్తికా భాటియా కాంట్రాక్ట్‌లను దక్కించుకున్నారు. ఈ గ్రేడ్‌లో ఉన్నవారికి గతేడాది రూ. 10 లక్షలను వార్షిక వేతనంగా చెల్లించింది. కాగా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్‌లు ప్రమోషన్ పొంది బీ గ్రేడ్ దక్కించుకోగా... రాజేశ్వరి గైక్వాడ్ ఏ నుంచి బీ గ్రేడ్‌కు పడిపోయింది. స్పిన్నర్ పూనమ్ యాదవ్, శిఖా పాండే కాంట్రాక్ట్ జాబితాలో స్థానం కోల్పోయారు.
ఇకపోతే పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకూ మ్యాచ్ ఫీజులను చెల్లించడానికి బీసీసీఐ అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే వార్షికంగా చెల్లించే వేతనాల్లో మాత్రం ఇరువురికి చాలా వ్యత్యాసం ఉంది. పురుష క్రికెటర్లలో టాప్ గ్రేడ్ అయిన ఏ+ కేటగిరీ ప్లేయర్లకు రూ. 7 కోట్లు, ఏ గ్రేడ్ ప్లేయర్లకు రూ.5 కోట్లు, బీ గ్రేడ్ ప్లేయర్లకు రూ.3 కోట్ల వరకు వేతనం అందుతోంది. పురుషుల్లో ఏ+ గ్రేడ్ జాబితాలో బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు. ఏ గ్రేడ్‌లో ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్, బౌలర్ మహమ్మద్ షమీ ఉన్నారు.