భారత మహిళా జట్టు ఏడో సారి ఆసియా కప్ టైటిల్ కైవసం చేసుకుంది. కీలకమైన ఫైనల్లో టీమ్ఇండియా బౌలర్లు విజృంభించారు. శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది.
టాస్ నెగ్గిన లంక తొలుత బ్యాటింగ్ ఎంచుకొంది. భారత బౌలర్లు బెంబేలెత్తించడంతోపాటు.. అనవసర తప్పిదాలు చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రనౌట్లతో మొదలై..
లంక పతనం కెప్టెన్ చమరి ఆటపట్టు (6), అనుష్క సంజీవని (2) రనౌట్లతో మొదలైంది. స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత భారత బౌలర్ రేణుకా సింగ్ (3/5) విజృంభించడంతో లంక ఏదశలోనూ కోలుకోలేకపోయింది. లంక జట్టులో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఇనోకా రణవీర (18), ఓషాది రణసింగె (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. రేణుకా సింగ్‌కు మద్దతుగా రాజేశ్వరి గైక్వాడ్ (2/13), స్నేహ్ రాణా (2/16) రాణించడంతో లంక ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. చివర్లో రణవీర కాస్త దూకుడుగా ఆడటంతో లంక ఈ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. మిగిలిన బ్యాటర్లలో హర్షిత మాధవి 1, నిలాక్షి డి సిల్వా 6, హాసిని పెరీరా డకౌట్, కవిష దిల్హారి 1, సుగంధిక కుమారి 6, ఆచిని 6 పరుగులు చేశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. సూనాయాసంగా టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్ స్మృతి మంధాన చేలరేగి ఆడింది. అర్ధశతకం చేసి జట్టు విజయంలో కీలకం అయింది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ 8 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. దీంతో ఒక వికెట్ కోల్పోయేసరికి 32 పరుగులు జోడించారు ఓపెనర్లు. అనంతరం వచ్చిన జెమియా రోడ్రిగ్స్ వెంటనే 4 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగింది. దీంతో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది టీమ్ ఇండియా.
మహిళల ఆసియా కప్ గెలిచిన టీమ్ ఇండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆసియా కప్ గెలిచిన జట్టును అభినందించారు. "మన మహిళా క్రికెట్ జట్టు తెగువ, నైపుణ్యంతో మనల్ని గర్వపడేలా చేస్తోంది. మహిళల ఆసియా కప్‌ను గెలుచుకున్న జట్టుకు నా అభినందనలు. జట్టు అద్భుతమైన నైపుణ్యం, టీమ్ వర్క్‌ను ప్రదర్శించింది" అని ప్రధాని మోదీ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు.
ఇవీ చదవండి: టీమ్ఇండియా-పాక్ ప్లేయర్స్ కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారంటే?