టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, స్పిన్ ఆల్‌రౌండర్ సలీం దురానీ కన్నుమూశారు. 88 ఏళ్ల వయస్సున్న ఆయన చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడం వల్ల ఆదివారం ఉదయం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో తుదిశ్వాస విడిచారు. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన దురానీ.. 1971లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ చారిత్రక విజయం అందుకోవడంతో ప్రముఖ పాత్ర పోషించారు. భారత్ తరఫున ఆయన మొత్తం 29 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో 1202 పరుగులు చేశారు. అదేవిధంగా 75 వికెట్లు పడగొట్టారు. దురానీ మృతిపట్ల మాజీ క్రికెటర్, టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంతాపం ప్రకటించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
దురానీ.. 1934, డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ జన్మించారు. తన 8 నెలల వయస్సులో ఆయన కుటుంబం కరాచీకి వలస వచ్చి స్థిరపడింది. 1947లో భారత్-పాక్ విభజన అనంతరం దురానీ కుటుంబ సభ్యులు భారత్‌కు వచ్చేశారు. 1960లో ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో భారత్ తరఫున అరంగేట్రం చేశారు దురానీ. 1960-70 దశకంలో భారత జట్టులో బెస్ట్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందారు. బౌలింగ్‌తో పాటు తన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన చివరిసారిగా 1973 ఫిబ్రవరిలో ముంబయి వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడారు.
అనంతరం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దురానీ.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నటుడు ప్రవీన్ బాబీతో కలిసి 'చరిత్ర' సినిమాలో పని చేశారు. కాగా, భారత ప్రభుత్వం అందించే అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకున్న క్రికెటర్ సలీం దురానీనే కావడం విశేషం. 1960లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రదానం చేసింది. దురానీ తన ఆట, వ్యక్తిత్వంతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎంతగా అంటే.. ఒకసారి కాన్పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో దురానీని దూరం పెడితే.. ఫ్యాన్స్ అందరూ 'నో దురానీ.. నో టెస్ట్!' అని రాసి ఉన్న బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శించేంతగా.
ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం..
సలీం దురానీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. "సలీం దురానీ జీ ఒక క్రికెట్ లెజెండ్. ఆయన ఒక ఇన్స్టిట్యూషన్. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ ఎదగడానికి ఆయన ఎంతో దోహదం చేశారు. మైదానంలో, మైదానం బయట ఆయన తన స్టైల్‌కు ప్రసిద్ధి చెందారు. ఆయన మృతి బాధ కలిగించింది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. నేను ఆయనతో మాట్లాడే అవకాశం పొందాను. ఆయన బహుముఖ వ్యక్తిత్వం నన్ను చాలా ఆకట్టుకుంది. ఆయన్ను చాలా మిస్ అవుతాం" అని నరేంద్ర మోదీ ట్విట్ చేశారు.