T20 World Cup: టీ20 ప్రపంచ కప్ సూపర్-12 దశను భారత్ ఘన విజయంతో ముగించింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 71 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో దిగిన జింబాబ్వే 115 పరుగులకే కుప్పకూలింది. భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (61; 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్‌లు రోహిత్ శర్మ, క్రెయిగ్ ఎర్విన్‌లతో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' సూర్యకుమార్ యాదవ్ మాట్లాడారు.
ఇంగ్లాండ్‌తో హోరాహోరీ పోటీ ఖాయం: రోహిత్ శర్మ
'ఇది మంచి ఆల్‌రౌండ్ ప్రదర్శన. మేం ఆశించింది కూడా ఇదే. ఈ మ్యాచ్‌కు ముందు మేం సెమీస్‌కు అర్హత సాధించాం. కానీ, దీన్ని పట్టించుకోకుండా అనుకున్న విధంగా ఆడటం ముఖ్యం. జట్టుకు సూర్యకుమార్ అందిస్తున్న సేవలు మరువలేనివి. అతడి సామర్థ్యమేంటో మాకు తెలుసు. సూర్యకుమార్ క్రీజులో ఉంటే మేమంతా రిలాక్స్‌గా ఉంటాం. ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్స్‌కు ముందు వీలైనంత త్వరగా పరిస్థితులకు అనుగుణంగా సన్నద్ధం కావడం మాకు కీలకం. టోర్నీలో ఇప్పటివరకు మేం బాగానే ఆడాం. కానీ, సెమీస్‌లో బలమైన ఇంగ్లాండ్ మాకు ప్రత్యర్థి. ఆ జట్టు బాగా ఆడుతోంది. ఈ రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుంది. మాకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు హ్యాట్సాఫ్. మేం ఆడిన ప్రతి మ్యాచ్‌కీ స్టేడియాలు నిండిపోతున్నాయి. జట్టు తరఫున వారికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా' అని రోహిత్ శర్మ అన్నాడు.
మేం అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాం: క్రెయిగ్ ఎర్విన్
'మేం వివిధ రకాల ప్లాన్‌లను మార్చగలిగాం. సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. మా బౌలర్లు విసిరిన వైడ్ యార్కర్లను ఎదుర్కొన్నాడు. అతడు నిర్భయంగా ఆడి ఆట గమనాన్నే మార్చేశాడు. టోర్నమెంట్‌లో ఆరంభంలో మా జట్టు బ్యాటింగ్ బాగానే ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. గత కొన్ని మ్యాచ్‌ల్లో మేం అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాం. సూపర్ 12లోకి రావడానికి చాలా కష్టపడ్డాం. మా ఫీల్డింగ్ ఎంతో మెరుగైంది' అని తెలిపాడు.
సెమీ ఫైనల్స్ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్
'నేను, హార్దిక్ పాండ్య కలిసి స్పష్టమైన ప్రణాళికతో బ్యాటింగ్ చేశాం. సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుని హిట్టింగ్ చేయడం ప్రారంభించి దాన్ని అలాగే కొనసాగించాం. జట్టు వాతావరణం చాలా బాగుంది. సెమీ ఫైనల్స్ కోసం ఎదురు చూస్తున్నాను. నా ప్లాన్ ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది. నేను నెట్స్‌లో అదే పని చేస్తాను. అవే షాట్‌లను ప్రాక్టీస్ చేస్తాను. పరిస్థితులకు అనుగుణంగా, జట్టుకు ఏం అవసరమో దానిని బట్టి బ్యాటింగ్ చేస్తా. టీ20ల్లో నంబర్ వన్‌గా నిలవడంతో చాలా సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు.