South Africa vs India: మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, పుజారా, కోహ్లి, రహానె, శ్రేయస్, పంత్.. ఇదీ ఆదివారం దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే తొలి టెస్టుకు భారత ప్రధాన బ్యాటింగ్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. వీళ్లలో మయాంక్, శ్రేయస్, పంత్‌కు సఫారీ గడ్డపై ఇదే తొలి సిరీస్. ఇక కెప్టెన్ కోహ్లీతో సహా కీలక ఆటగాళ్లు పుజారా, రహానె ఫామ్‌లో లేరు. మరోవైపు గాయం కారణంగా ఓపెనర్ రోహిత్ దూరమవడం గట్టి దెబ్బే. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత బ్యాటింగ్ ప్రదర్శనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటువైపు గాయంతో నార్జ్ తప్పుకున్నా రబాడ, ఎంగిడి, కేశవ్ మహారాజ్, హెండ్రిక్స్‌లతో కూడిన సఫారీ బౌలింగ్ దళం పటిష్ఠంగానే కనిపిస్తోంది. వీళ్ల సవాలును తట్టుకుని మన బ్యాటర్లు ఏ మేరకు నిలబడగలరు? పేస్ పిచ్‌లపై ఎలాంటి ప్రదర్శన చేయగలరు? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
ఉత్తమంగా ఆడితేనే..
దక్షిణాఫ్రికాలో తొలిసారి ఆడబోతున్న మయాంక్, శ్రేయస్, పంత్‌కు అక్కడి పరిస్థితులకు అలవాటు పడడమే అసలైన సవాలు. రాహుల్‌కు ఇప్పటికే ఓ సారి అక్కడ ఆడిన అనుభవం ఉంది. 2018 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లాడిన అతను నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 30 పరుగులు మాత్రమే చేశాడు. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎంతో మెరుగయ్యాడు. అన్ని ఫార్మాట్లలోనూ కీలకంగా మారాడు. ముఖ్యంగా ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌లో టెస్టుల్లోనూ అదరగొట్టాడు. ఇక కివీస్‌తో రెండో టెస్టులో ఓ శతకం, అర్ధసెంచరీ చేసిన మయాంక్ ఫామ్ అందుకోవడం శుభపరిణామం. 2019లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అతను మూడు మ్యాచ్‌ల్లో 85 సగటుతో 340 పరుగులు చేశాడు. అందులో ఓ ద్విశతకం, సెంచరీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రత్యర్థి దేశంలోని పేస్ పిచ్‌లపై అతను ఎలా రాణిస్తాడన్నది ఆసక్తిగా మారింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేసి తొలి మ్యాచ్‌లోనే శతకం, అర్ధశతకం చేసిన శ్రేయస్‌కు ఇప్పుడు సఫారీ గడ్డపై సిసలైన పరీక్ష ఎదురుకానుంది. ఇక విదేశాల్లో మంచి రికార్డే ఉన్న పంత్‌కు నిలకడలేమి సమస్యగా మారుతోంది. ఓ ఇన్నింగ్స్‌లో వీరోచిత పోరాటం వల్ల హీరోగా నిలిస్తే.. మరో ఇన్నింగ్స్‌కు వచ్చేసరికి జట్టును క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టి వికెట్ పారేసుకుంటున్నాడు. ఆటతీరును మార్చుకుని.. జట్టుకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అతనిపై ఉంది.
ఆ ముగ్గురు..
ప్రస్తుత జట్టులోని ముగ్గురు ప్రధాన బ్యాటర్లు కోహ్లి, పుజారా, రహానె ఫామ్‌లో లేకపోవడం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా గడ్డపై మూడు సిరీస్‌ల్లో (2010-11, 2013-14, 2017-18) ఆడిన అనుభవం పుజారా సొంతం. కోహ్లి, రహానె రెండు సార్లు అక్కడ పర్యటించారు. 2013-14 సిరీస్‌లో 70 సగటుతో 280 పరుగులు చేసిన పుజారా.. గత సిరీస్‌లో మాత్రం కేవలం 16.66 సగటుతో 100 పరుగులు చేసి విఫలమయ్యాడు. ఇక ఇప్పుడేమో అతని ఫామ్ అంతంతమాత్రంగానే ఉంది. అతను శతకం చేసి దాదాపు మూడేళ్లు కావస్తోంది. చివరగా 2019 జనవరిలో సిడ్నీలో ఆస్ట్రేలియాపై 193 పరుగులు చేశాడు. గత 24 మ్యాచ్‌ల్లో ఓ ఇన్నింగ్స్‌లో అతను సాధించిన అత్యధిక స్కోరు 91 (ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో) మాత్రమే.
ఇక రహానేకు ప్రస్తుతం గడ్డు రోజులు నడుస్తున్నాయి. జట్టులో చోటు కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. ఇప్పటికే టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ పోయింది. ఈ సిరీస్‌లో విఫలమైతే అతను తిరిగి జట్టులోకి రావడం ఇక దాదాపు అసాధ్యమే. అతను చివరగా ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ (2020 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై 112) చేసి ఏడాది కావస్తోంది. గత 12 టెస్టుల్లో అతని ప్రదర్శన మరీ పేలవంగా ఉంది. అయితే దక్షిణాఫ్రికాలో అతని రికార్డు ఆశాజనకంగా ఉండడం సానుకూలాంశం. 2013లో రెండు మ్యాచ్‌లాడి 69.66 సగటుతో 209 పరుగులు చేసిన అతను.. గత సిరీస్‌లో జట్టు విజయం సాధించిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్ (48)గా నిలిచాడు.
మరోవైపు పరుగుల యంత్రంగా పేరు సంపాదించుకున్న కోహ్లి ఈ మధ్య కాలంలో దానికి న్యాయం చేయలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతను మూడంకెల స్కోరు అందుకుని రెండేళ్లు దాటింది. గత 13 టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో అతని అత్యధిక స్కోరు 74 మాత్రమే. ఒకప్పుడు మంచి నీళ్లు తాగినట్లు సెంచరీలు బాదిన అతను.. ఇప్పుడు ఒక్క శతకం కోసం నిరీక్షణ కొనసాగిస్తున్నాడు. కెప్టెన్సీ భారం ఆట మీద పడుతుందని టీ20 సారథ్య బాధ్యతలను వదులుకున్న అతణ్ని.. వన్డే కెప్టెన్‌గానూ తప్పిస్తూ బీసీసీఐ షాకిచ్చింది. ఆ వివాదం కోహ్లి ఆటపై ప్రభావం చూపితే అది జట్టుకు మరింత చేటు చేసే ప్రమాదం ఉంది. ఎన్నో సార్లు తీవ్ర ఒత్తిడిలోనూ అత్యుత్తమంగా ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన అతను సఫారీ గడ్డపై మునుపటి ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ మంచి రికార్డు ఉండడం అతనికి కలిసొచ్చే అంశం.
ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 55.80 సగటుతో 558 పరుగులు చేశాడు. ముఖ్యంగా గత పర్యటనలో సెంచూరియన్ టెస్టులో అతను తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా నిలిచిపోయే ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు మొత్తం కలిసి 307 పరుగులు చేస్తే.. అందులో దాదాపు సగం పరుగులు (153) కోహ్లీవే. ఓ వైపు ఫాస్ట్‌బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ప్రత్యర్థి పేసర్లు విజృంభిస్తుంటే పట్టుదలతో అతను క్రీజులో నిలబడ్డాడు. ఆ ప్రదర్శన నుంచి ఇప్పుడు కోహ్లి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌లతో తన విలువను చాటి చెప్పాలి.
ఇదీ చూడండి : సిరాజ్ కాళ్లలో స్ప్రింగ్‌లు ఉంటాయి: సచిన్