Kohli Rohith Captaincy: కెప్టెన్‌గా వీడ్కోలు చెప్పిన విరాట్ కోహ్లీ.. ఓ ఆటగాడిగా అదే ఉత్సాహాన్ని కొనసాగించడమే అతడి ముందున్న అతిపెద్ద సవాల్ అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వ్యవహార శైలిని రవిశాస్త్రి తనదైన శైలిలో విశ్లేషించాడు. ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ దూకుడుగా.. డేంజరస్‌గా ఓ బీస్ట్‌లా వ్యవహరిస్తాడని తెలిపాడు. అయితే మైదానం వెలుపల చాలా సాదాసీదాగా ఉంటాడని పేర్కొన్నాడు.రోహిత్ శర్మ చాలా రిలాక్స్‌గా ఉంటూ జట్టును నడిపిస్తాడని రవిశాస్త్రి చెప్పాడు.
"విరాట్ కోహ్లీ ఫీల్డ్‌లో చాలా దూకుడుగా ఉంటాడు. యుద్ధ వీరుడిలా పోరాడుతాడు. ఒక్కసారి మైదానంలోకి దిగితే సర్వశక్తులూ ఒడ్డి మరీ పోరాటం చేసేందుకు సిద్ధమవుతాడు. ఆట నుంచి బయటకొచ్చాక మొత్తం మారిపోతాడు. కెప్టెన్‌గా ఇప్పటివరకు ఆడిన అతడు ప్లేయర్‌గా కూడా అంతే ఎనర్జీతో ఆడాలి. జట్టు విజయం కోసం మరిన్ని పరుగులు చేయాలి. ఇదే కోహ్లీ ముందున్న అసలైన సవాల్. ఇక రోహిత్ శర్మ విషయానికొస్తే.. మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. గేమ్‌ను తన అధీనంలోకి సులువుగా తెప్పించుకోగలడు. ‘దేవుడు నాకు ఈ బహుమతి ఇచ్చాడు. కష్టపడి పనిచేయనివ్వండి అని రోహిత్ భావిస్తూ ఉంటాడు. మంచి ఊపులో ఉన్నప్పుడు అతడిలా బ్యాటింగ్ చేయగలిగే ఆటగాళ్లు చాలా తక్కువ" అని వివరించాడు.
విరాట్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి
Jonty Rhodes on kohli captaincy: అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి బయటపడిన విరాట్ కోహ్లీతో ప్రత్యర్థి జట్లు అప్రమత్తంగా ఉండాలని దక్షిణాఫ్రికా మాజీ జాంటీ రోడ్స్ హెచ్చరించాడు. తనను తాను నిరూపించుకునేందుకు కోహ్లీ భారీగా పరుగులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
"నాయకత్వ బాధ్యతలు లేని కోహ్లీని చూస్తే కొంచెం ఆందోళన పడతా. అదేదో అతడికి భారం దిగిందని కాదు. ఒత్తిడి లేకపోతే భారీగా పరుగులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. టెస్టు కెప్టెన్‌గా దిగిపోవడం కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమే. అతడు పూర్తిగా ఆటకు వీడ్కోలు చెప్పలేదు. చాలా మంది సారథులు రిటైర్మెంట్ ప్రకటించగానే ఆటను వదిలేసి వెళ్లారు. అయితే కోహ్లీ అలా కాకుండా ఇంకా జట్టు కోసం పరుగులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు" అని తెలిపాడు.
అభిమానులకు కప్పులు కావాలి... ర్యాంకులు కాదు
manjrekar on kohli captaincy: విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐకి మాజీ క్రికెటర్, విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్ మద్దతు తెలిపాడు. విరాట్‌ను తొలగించి రోహిత్ శర్మను నియమించిన బీసీసీఐ నిర్ణయం సరైందేనని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ట్రోఫీని నెగ్గలేకపోవడమే కోహ్లీపై వేటుకు కారణమని పేర్కొన్నాడు. అభిమానులు ప్రపంచకప్‌లను గెలవాలని కోరుతున్నారని, అందుకే కోహ్లీని తప్పించి రోహిత్‌కు బాధ్యతలను బీసీసీఐ అప్పగించి ఉంటుందని విశ్లేషించాడు.
వన్డే సారథ్యం నుంచి తప్పించడంపై కోహ్లీ అసంతృప్తిగా ఉండటం సరైందేనా అన్న ప్రశ్నకు మంజ్రేకర్ సమాధానం ఇస్తూ.. "అభిమానులు ప్రపంచకప్ వంటి ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఆశిస్తున్నారు. అంతేకానీ ఇదేదో ర్యాంకులు, సిరీస్‌ల గురించి కాదు. అందుకే కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు" అని వివరించాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమ్ఇండియా అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానం దక్కించుకుంది. అయితే కోహ్లీ నాయకత్వంలో ఒక్కటంటే ఒక్క ఐసీసీ ట్రోఫీని భారత్ గెలుచుకోలేకపోయింది.
గత ఐపీఎల్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్‌గా కూడానూ కోహ్లీ దిగిపోయిన విషయం తెలిసిందే. దీనిపై సంజయ్ మాట్లాడుతూ.. "ఆర్సీబీ జట్టుకు నాయకత్వం కొనసాగించి ఉంటే బాగుండేది. కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని భావించాడు. అందుకే వన్డేలు, టెస్టుల్లో కచ్చితంగా సారథ్య బాధ్యతలను నిర్వర్తించాలని అనుకుని ఉంటాడు. అయితే బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది. అతడి చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతుండటంతో టెస్టుల్లో నాయకత్వానికి గుడ్‌బై చెప్పేసి ఉండొచ్చు" అని విశ్లేషించాడు.
టెస్టు కెప్టెన్‌గా వారిద్దరిలో ఒకరు
Smith on Test Captaincy: విరాట్ కోహ్లీ స్థానంలో టీమ్ఇండియా టెస్టు జట్టుకు స్టీవ్‌స్మిత్ ఇద్దరి పేర్లను సూచించాడు. వారిద్దరిలో ఒకరైతే సరిగ్గా సరిపోతారని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఎవరికైనా సరే విరాట్ స్థానంలో నాయకత్వం అప్పగించవచ్చని తెలిపాడు. "తొలుత విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు. గత ఆరేడు సంవత్సరాలుగా టీమ్ఇండియాను అద్భుతంగా నడిపించాడు. అతడి స్థానంలో కెప్టెన్సీ అప్పగించాలంటే రోహిత్, కేఎల్ రాహుల్ పేర్లను సూచిస్తా" అని వివరించాడు.
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!