జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అధిపతి హోదాకు భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తిరిగి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్ అనంతరం రవిశాస్త్రి స్థానంలో అతడు భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడన్న ఊహాగానాలకు తెరపడ్డట్లయింది.
ఎన్‌సీఏ అధిపతిగా ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం ముగియడం వల్ల బీసీసీఐ ఇటీవలే ఆ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. నిబంధనల ప్రకారం ద్రవిడ్ పదవీకాలాన్ని పొడిగించడానికి వీల్లేదు. ఎంపిక ప్రక్రియను తాజాగా ఆరంభించాల్సిందే. అయితే గడువు తేదీ (ఆగస్టు 15) నాటికి ద్రవిడ్ తప్ప ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. దీంతో బీసీసీఐ గడువును ఇంకొన్ని రోజులు పెంచాలని నిర్ణయించింది. ద్రవిడ్ శ్రీలంక పర్యటనలో భారత జట్టు కోచ్‌గా వ్యవహరించాడు.
ఇదీ చూడండి: కోచ్ పదవికి రవిశాస్త్రి గుడ్‌బై!.. ద్రవిడ్‌పైనే అందరి దృష్టి?