Cheteshwar Pujara Test Performance : ఇటీవల జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోనూ పేలవ ప్రదర్శన కనబర్చాడు ఛెతేశ్వర్ పుజారా. అయితే, అంతకుముందు ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో పరుగులు వరద పారించినా.. ముఖ్యమైన మ్యాచ్‌లో చేతులెత్తేశాడు. దీంతో తాజాగా వెస్ట్ఇండీస్తో సిరీస్‌లో బీసీసీఐ పుజారాను పక్కన పెట్టింది. దీంతో పుజారా కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు ఓకే చెప్పాడు. త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో తన ఫామ్‌ను తిరిగి పొందాలని ఆశిస్తున్నాడు. తద్వారా మళ్లీ టీమ్ఇండియాలో ఆడాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ట్రోఫీలో పుజారాతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా ఆడేందుకు ఓకే చెప్పాడు.
మరోవైపు, డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే మినహా బ్యాటింగ్ విభాగం మొత్తం విఫలమైతే.. పుజారాపైనే ఎందుకు వేటు వేశారని మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ప్రశ్నించారు. అతడొక్కడినే బలిపశువును చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'మన బ్యాటింగ్ వైఫల్యాలకు అతన్ని ఎందుకు బలిపశువుగా మార్చారు? అతడు భారతీయ క్రికెట్‌కు నమ్మకమైన సేవకుడు. అతడికి సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్లు లేరు. అందుకే మీరు అతడిని జట్టులోంచి తీసేశారా? అది అర్థం చేసుకోలేని విషయం. విఫలమైన ఇతరులను జట్టులో కొనసాగించడానికి ప్రమాణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు అడిగేందుకు.. ఈ రోజుల్లో సెలక్షన్ కమిటీ ఛైర్మన్ తదితరులతో ప్రెస్ కాన్ఫరెన్స్ జరగడం లేదు'
'ఈ రోజుల్లో ఆటగాళ్లు 39 లేదా 40 ఏళ్ల వరకు ఆడొచ్చు. అందులో తప్పు లేదు. వారంతా చాలా ఫిట్‌గా ఉన్నారు. వారు పరుగులు చేస్తున్నంత కాలం, వికెట్లు తీస్తున్నంత కాలం వయసు ఒక అడ్డంకి కాదని నేను అనుకుంటున్నాను. చాలా మంది ఫెయిల్ అయితే, ఒకడిపైనే వేటు వేశారు. నాకు తెలిసి బ్యాటింగ్ విభాగం మొత్తం విఫలమైంది. అజింక్యా రహానే మినహా ఎవరూ పరుగులు రాబట్టలేదు. కాబట్టి పుజారాను ఎందుకు తీసుకోలేదో.. సెలక్టర్లు వివరించాలి' అని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.
జట్టులో కొనసాగాలంటే ఆ పని చేయాల్సిందే!
Cheteshwar Pujara Test Career : యువబ్యాటర్లు విజృంభిస్తున్న వేళ.. పుజారా తిరిగి భారత జట్టులోకి వెళ్లడం చాలా కష్టమైన పని. దాని కోసం అతడు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. పుజారా ఇప్పటివరకు టీమ్ఇండియాలో అతి కష్టం మీద కొనసాగాడు. గత ప్రదర్శనలను దృష్టిలో ఉంచుకుని, ప్రతికూల పరిస్థితుల్లో సుదీర్ఘ సమయం క్రీజులో నిలబడే అతడి సామర్థ్యాన్ని నమ్మి సెలక్టర్లు అనేక అవకాశాలు ఇచ్చారు. అయితే, ఇప్పుడు టెస్టుల్లోనూ పుజారాకు అవకాశం పోయింది. రహానేలా ఐపీఎల్‌లో మెరిసి సెలక్టర్లు, అభిమానుల దృష్టిలో పడదామనుకుంటే.. అందులో అతడి సేవలను ఏ జట్టూ ఉపయోగించుకునేలా లేదు. ఈ స్థితిలో దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో, కౌంటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తే తప్ప మళ్లీ సెలక్టర్లు పుజారా వైపు చూడకపోవచ్చు. ఇకు ఈ గ్యాప్‌లో రుతురాజ్, యశస్వి లాంటి యంగ్ ప్లేయర్లు సత్తా చాటితే.. పుజారాకు టీమ్ఇండియా తలుపులు తెరుచుకోవడం కష్టమే.