గ్రూప్ దశలో ఇలా.. ఫస్ట్ మ్యాచ్ రద్దు.. రెండో మ్యాచ్ బౌల్ అవుట్ ద్వారా విజయం సాధించిన టీమ్‌ఇండియా.. మూడు పాయింట్లతో గ్రూప్ దశను అగ్రస్థానంతో ముగించింది. స్కాట్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్, భారత్ స్కోర్లు సమంకావడంతో బౌల్ అవుట్‌కు వెళ్లింది. అయితే టీమ్‌ఇండియా 3-0 తేడాతో పాక్‌పై గెలిచి మ్యాచ్‌ను కైవసం చేసుకోవడంతోపాటు సూపర్-8కి అర్హత సాధించింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాబిన్ ఉతప్ప (50) అర్ధశతకం చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్ కూడా తమ తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను చిత్తు చేయడంతో తదుపరి దశకు చేరుకొంది.
సూపర్-8లోనూ అగ్రస్థానమే.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి పటిష్ట జట్లతో భారత్ సూపర్-8 పోరులో తలపడింది. న్యూజిలాండ్ మీద మినహా మిగతా మ్యాచుల్లో టీమ్‌ఇండియావిజయం సాధించింది. ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్‌కూడా గెలవకపోవడం గమనార్హం. సూపర్-8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అప్పటి యువ ఆటగాడు.. ప్రస్తుత టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ (50) అర్ధశతకం సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 153/5 స్కోరు సాధించింది. అనంతరం ఆర్పీ సింగ్ (4/13) విజృంభణతో దక్షిణాఫ్రికా 116/9 స్కోరుకే పరిమితమైంది. సూపర్-8 గ్రూప్ -ఈ నుంచి అగ్రస్థానంతో భారత్ సెమీఫైనల్‌కు వెళ్లింది.
యువరాజ్ కీలక ఇన్నింగ్స్.. సూపర్-8 దశలో రెండు గ్రూప్‌ల నుంచి భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా సెమీస్‌కు దూసుకెళ్లాయి. సెమీస్‌లో భారత్-ఆస్ట్రేలియా, కివీస్-పాక్ జట్లు తలపడ్డాయి. అప్పటికే ఆసీస్ వన్డే ప్రపంచకప్‌లను అత్యధికంగా సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఆ జట్టు బౌలింగ్ ఎటాక్ కూడా భయంకరంగా ఉండేది. బ్రెట్‌లీ, నాథన్ బ్రాకెన్, మిచెల్ జాన్సన్ వంటి పేసర్లతోపాటు ఆండ్రూ సైమండ్స్, మైకెల్ క్లార్క్ స్లో బౌలర్లు ఉండేవారు. ఒక్క బ్రెట్‌లీని తప్ప మిగతా బౌలర్లను లక్ష్యంగా చేసుకొని భారత బ్యాటర్లు దాడి చేశారు. మరీ ముఖ్యంగా యువరాజ్ సింగ్ (70: 30 బంతుల్లో 5 సిక్స్‌లు, 5 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. యువీతోపాటు కెప్టెన్ ఎంఎస్ ధోనీ (36), రాబిన్ ఉతప్ప (34), గౌతమ్ గంభీర్ (24) రాణించారు. అయితే భారత్ నిర్దేశించిన 189 పరుగుల ఛేదనలో ఆసీస్ ధాటిగానే ఆడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించి వికెట్లను తీయడంతో ఆసీస్ 173/7 స్కోరుకు పరిమితమై 15 పరుగుల తేడాతో ఓడింది.
మళ్లీ దాయాదుల పోరు.. గ్రూప్ దశలో ఒకసారి తలపడిన దాయాదులు.. మరోసారి ఢీకొట్టుకున్నారు. అదీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్ కోసం కావడం విశేషం. ఫైనల్‌లోనూ హోరాహోరీగా సాగింది. గౌతమ్ గంభీర్ (75 పరుగులు: 54 బంతుల్లో 2 సిక్స్‌లు, 8 ఫోర్లు) అదరగొట్టాడు. రోహిత్ శర్మ (30*) కూడా కీలక పరుగులు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 157/5 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనను ప్రారంభించిన పాక్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆర్పీసింగ్ దెబ్బకు పాక్ బ్యాటర్ హఫీజ్ (1) తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. ఇమ్రాన్ నజీర్ (33) దూకుడుగా ఆడటంతో పాక్ మళ్లీ రేసులోకి వచ్చింది. అయితే భారత బౌలర్లు మరోసారి విజృంభించి స్వల్ప వ్యవధిలో వికెట్లు తీస్తూ పాక్‌పై ఒత్తిడి పెంచారు.
చివరి ఓవర్ అనూహ్యం.. చివరి ఓవర్‌లో పాక్‌కు 13 పరుగులు అవసరం కాగా.. ఒక్క వికెట్ తీస్తే కప్ టీమ్‌ఇండియా సొంతమవుతుంది. ఈ క్రమంలో కెప్టెన్ ధోనీ అనూహ్యంగా మీడియం పేసర్ జోగిందర్ శర్మ చేతికి బంతినిచ్చాడు. అయితే క్రీజ్‌లో మిస్బా ఉల్ హక్ (43) ఉండటంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. జోగిందర్ తొలి బంతిని వైడ్‌గా వేశాడు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 12 పరుగులు.. కానీ జోగిందర్ కాస్త తెలివిగా బంతిని సంధించాడు. దీంతో పరుగేమీ రాలేదు. అప్పుడు సమీకరణం 5 బంతుల్లో 12 పరుగులుగా మారింది. అయితే రెండో బంతిని మిస్బా సిక్స్‌గా మలిచాడు. దీంతో టీమ్‌ఇండియా అభిమానుల్లో కంగారు మొదలైంది. చివరి నాలుగు బంతులకు కేవలం ఆరు పరుగులు చేస్తే చాలు పాక్‌దే విజయం. అయితే మూడో బంతికి మిస్బా ఉల్ హక్ స్కూప్ షాట్‌కు యత్నించగా.. నేరుగా షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న కాచుకొని ఉన్న శ్రీశాంత్ చేతిలో పడటం.. టీమ్‌ఇండియా అభిమానుల కేరింతలు.. టైటిల్‌ను భారత క్రికెటర్లు అందుకోవడం చకచకా జరిగిపోయాయి.
సలహాలను స్వీకరించేవాడు.. తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో నెగ్గిన జట్టులో హర్భజన్ సింగ్ ఒకడు. 2007 వరల్డ్ కప్ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేందుకు ఓ క్రీడా ఛానెల్ నిర్వహించిన ‘07 ఛాంపియన్స్’ కార్యక్రమంలో భజ్జీ మాట్లాడుతూ.. ‘‘తొలిసారి టైటిల్‌ను ఎత్తుకొనే వరకు ధోనీ మా జట్టుకు కెప్టెన్ అని మేం భావించలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అందులో ఉంది. ప్రతి మ్యాచ్‌లో అవసరమైన పరిస్థితుల్లో ఆటగాళ్ల సలహాలను, సూచనలను ధోనీ స్వీకరించేవాడు. అత్యుత్తమంగా రాణించేందుకు ఏం చేయాలని భావిస్తున్నారో అలాగే చేయండని ప్రోత్సహించేవాడు. పాక్‌తో బౌల్ అవుట్ సందర్భంగా మేం ఎక్కువగా రన్‌అప్ తీసుకోకూడదని ముందే అనుకున్నాం. ఓ మూడు నాలుగు స్టెప్పులు వేసేలా ప్రణాళిక చేసుకున్నాం. దూరం నుంచి పరిగెత్తుకొస్తే బ్యాలెన్స్‌ను కోల్పోయే ప్రమాదం ఉందని భావించి.. అలా నిర్ణయం తీసుకున్నాం’’ అని హర్భజన్ వివరించాడు. ఫస్ట్ టీ20 ప్రపంచకప్‌లో ఆడి.. ఇప్పటికీ క్రికెట్‌లో కొనసాగుతున్న ఆటగాళ్లు ఇద్దరే.. వారిలో ప్రస్తుత టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మరొకరు దినేశ్ కార్తిక్. వీరిద్దరూ ఆసీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ 2022 జట్టులోనూ సభ్యులు కావడం విశేషం.
ఇదీ చూడండి: Teamindia VS Australia: ఇద్దరిది ఒకే సమస్య.. సిరీస్ దక్కేదెవరికో?