ODI World Cup 2023 : ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసింది. ఇప్పుడు క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో సమరం సిద్ధమవుతోంది. అదేనండీ ఐసీసీ వన్డే ప్రపంచకప్. ఈ ఏడాది మన దేశంలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించింది. "బీసీసీఐ ఈ ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీతో పంచుకుంది. ఆ తర్వాత మిగతా దేశాలకు ఈ షెడ్యూల్‌ను అందిస్తారు. వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న అనంతరం తుది షెడ్యూల్‌ను రూపొందిస్తారు" అని అంతర్జాతీయ మీడియా తెలిపింది.
అహ్మదాబాద్‌లోనే ఫస్ట్ మ్యాచ్
BCCI Draft Schedule : ఈ ముసాయిదా షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ జట్టు న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా టోర్నీలోని తొలి మ్యాచ్ జరగనుంది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ ఉంటుంది.
పాక్- ఇండియా మ్యాచ్ ఎప్పుడంటే?
అయితే నవంబర్ 15, 16 తేదీల్లో జరిగే సెమీ ఫైనల్స్ కోసం వేదికలను ఇంకా ప్రకటించలేదు. భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా తలపడనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరగనుంది.
9 నగరాల్లో టీమ్ఇండియా..
కాగా, టీమ్ఇండియా లీగ్ దశలోని మ్యాచ్‌లను మొత్తం 9 నగరాల్లో ఆడనుంది. పాకిస్థాన్ 5 నగరాల్లో తన లీగ్ మ్యాచ్‌లను ఆడనుంది. మొత్తం 10 టీమ్‌లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లను నిర్ణయిస్తారు.
భారత్ ఆడనున్న మ్యాచ్‌ల వివరాలు..
- అక్టోబర్ 8 : టీమ్ఇండియా X ఆస్ట్రేలియా.. వేదిక చెన్నై
- అక్టోబర్ 11 : టీమ్ఇండియా X అఫ్గానిస్థాన్.. వేదిక దిల్లీ
- అక్టోబర్ 15 : టీమ్ఇండియా X పాకిస్థాన్.. వేదిక అహ్మదాబాద్
- అక్టోబర్ 19 : టీమ్ఇండియా X బంగ్లాదేశ్.. వేదిక పుణె
- అక్టోబర్ 22 : టీమ్ఇండియా X న్యూజిలాండ్.. వేదిక ధర్మశాల
- అక్టోబర్ 29 : టీమ్ఇండియా X ఇంగ్లాండ్.. వేదిక లఖ్‌నవూ
- నవంబర్ 2 : టీమ్ఇండియా X క్వాలిఫయర్ జట్టు.. వేదిక ముంబయి
- నవంబర్ 5 : టీమ్ఇండియా X దక్షిణాఫ్రికా.. వేదిక కోల్‌కతా
- నవంబర్ 11 : టీమ్ఇండియా X క్వాలిఫయర్ జట్టు.. వేదిక బెంగళూరు
పాకిస్థాన్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా..
మరోవైపు, దాయాది దేశం పాకిస్థాన్ ఐదు నగరాల్లో లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 6, 12 తేదీల్లో హైదరాబాద్ వేదికగా క్వాలిఫయర్‌కు అర్హత సాధించిన జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 15న భారత్‌తో (అహ్మదాబాద్), ఆస్ట్రేలియాతో బెంగళూరులో (అక్టోబర్ 20), అఫ్గానిస్థాన్‌తో (అక్టోబర్ 23), దక్షిణాఫ్రికాతో (అక్టోబర్ 27) చెన్నైలో తలపడనుంది. బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో అక్టోబర్ 31న, బెంగళూరులో న్యూజిలాండ్‌తో నవంబర్ 5న (డే మ్యాచ్), నవంబర్ 12న కోల్‌కతా వేదికగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడనుంది