ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజా లభిస్తుంది. అరంగ్రేటంలోనే కొత్త కుర్రాళ్లు దుమ్మరేపుతున్నారు. అయితే గురువారం.. లీగ్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఇది వరకు వీకెండ్లోనే డబుల్ హెడర్ ఉండగా.. కొన్ని కారణాల వల్ల గురువారం కూడా రెండు మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఈ మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల టేబుల్, ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్లలో చాలా మార్పులు వచ్చాయి. ఒక్క మ్యాచ్‌తోనే రాయల్ ఛాలెంజర్స్ జట్టు.. ఓ రేంజ్లో సత్తా చాటింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి.. పాయింట్ల టేబుల్లో ఐదో స్థానానికి దూసుకెళ్లింది. అంతే కాదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్లుగా ఆర్సీబీ టీమ్ ప్లేయర్స్ టాప్‌లో నిలిచారు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో 24 పరుగుల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్.. ఐదో స్థానానికి వెళ్లింది. ప్రస్తుతం ఆర్సీబీ ఆరు మ్యాచ్‌లలో మూడు విజయాలు, మూడు పరాజయాలతో 6 పాయింట్లు సాధించింది. ఆ టీమ్ నెట్ రన్‌రేట్ నెగటివ్‌గా ఉండటం వల్ల సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ కంటే కింద ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఏడో స్థానానికి పడిపోగా.. రెండో మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిదో స్థానంలోలో, సీజన్లో తొలి విజయం సాధించిన దిల్లీ క్యాపిటల్స్ పదో స్థానంలోనే కొనసాగుతున్నాయి.
ఇక అత్యధిక పరుగుల వీరుడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాప్‌లోకి దూసుకెళ్లాడు. డుప్లెసిస్ ఆరు మ్యాచ్‌లలో 343 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. అతడి స్ట్రైక్ రేట్ 166.5 కావడం విశేషం. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 56 బంతుల్లోనే 84 రన్స్ చేసిన డుప్లెసిస్.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు!
అటు ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్‌గా చేసిన విరాట్ కోహ్లీ 279 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వార్నర్ 285 పరుగులతో రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌కు ఇచ్చే పర్పుల్ క్యాప్‌లో ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ టాప్‌లోకి వెళ్లడం విశేషం. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సిరాజ్.. 12 వికెట్లతో ఈ లిస్టులో టాప్‌లో ఉన్నాడు. లఖ్‌నవూ సూపర్ కింగ్స్ బౌలర్ మార్క్ వుడ్, రాజస్థాన్ బౌలర్ యుజువేంద్ర చాహల్, గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ ముగ్గురూ తలా 11 వికెట్లతో రెండు, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్‌కే చెందిన మహ్మద్ షమీ 10 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
కోహ్లీ అరుదైన ఘనత..
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టీ20 చరిత్రలో జట్టు కెప్టెన్‌గా 6500 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. దాంతో పాటు లీగ్‌లో 600 ఫోర్లు బాదిన మూడో క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు.