GT Vs CSK Final : ఇంతకాలం క్రికెట్ ప్రియుల్ని ఎంతగానో అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ వేదికగా గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం ఫైనల్ పోరు జరగనుంది. ఓ వైపు వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను పట్టేయాలని గుజరాత్ ఆశిస్తుండగా.. మరోవైపు ఐదో కప్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని చెన్నై కసిగా ఉంది. ఈ క్రమంలో ఇదే వేదికగా పలు ప్రతిష్టాత్మక రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. అవేంటంటే..
Subhman Gill Century : రెండో క్వాలిఫయర్‌లో సెంచరీతో చెలరేగిన యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్.. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అందరి కంటే ముందే ఉన్నాడు. ఇప్పటికే అతను 851 పరుగులను స్కోర్ చేశాడు. అయితే, ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులను నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాలంటే..గిల్‌కు సరిగ్గా 122 పరుగులు అవసరం. అయితే ముంబయిపై శతకాన్ని బాది మంచి ఊపులో ఉన్న గిల్.. మరోసారి అదే ప్రదర్శన చేస్తే విరాట్(973) స్కోర్‌ను అధిగమిస్తాడు.
మరోవైపు ఒకే టీమ్ నుంచి ముగ్గురు బౌలర్లు పర్పుల్ క్యాప్ రేసులో నిలుచుని ఉన్నారు. 28 వికెట్లతో గుజరాత్ టీమ్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత 27 వికెట్లతో రషీద్ ఖాన్, 24 వికెట్లతో మోహిత్ శర్మ ఉన్నారు. అయితే చెన్నైతో జరిగే మ్యాచ్‌లో రషీద్ ఒక్క వికెట్, మోహిత్ నాలుగు వికెట్లు తీస్తే ముగ్గురు బౌలర్లు 28 వికెట్లతో ఉంటారు. ఇలా ఒకే సీజన్‌లో ఒకే జట్టు నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఉండటం కూడా ఓ రికార్డనే చెప్పాలి.
CSK Cup List : ఇక ప్రస్తుతం నాలుగు టైటిళ్లను సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి విజేతగా నిలవాలని అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ధోనీకి ఇదే చివరి సీజన్ అని భావిస్తున్న తరుణంలో తమ టీమ్ మేట్స్ ఈ గిఫ్ట్ ఇస్తారో లేదో వేచి చూడాలి. అయితే, సీఎస్‌కే ఈసారి విజేతగా నిలిస్తే మాత్రం ముంబయితో సమంగా నిలుస్తుంది. ముంబయి ఇప్పటికే ఐదు టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. చెన్నై కూడా గెలిస్తే.. వీరి కప్‌ల సంఖ్య 5కి చేరుతుంది.
చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే వరుసగా రెండు ఐపీఎల్ కప్‌లను సొంతం చేసుకున్న టీమ్‌గా కొనసాగుతోంది. ఇప్పుడు ఆ అవకాశం గుజరాత్ టైటాన్స్‌కు వచ్చింది. గతేడాది అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్.. ఇప్పటికే తొలి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. అయితే ఇప్పుడు ఫైనల్‌కు చేరడం వల్ల రెండో సారి విజేతగా నిలిచి చెన్నై సరసన చేరుతుందో లేదో చూడాలి మరి.
మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్‌ను గెలిస్తే ఐపీఎల్ చరిత్రలో మరో అద్భుతమైన రికార్డుగా మిగిలిపోతుంది. ముఖ్యంగా ధోనీ పేరిట అరుదైన ఘనత నమోదవుతుంది. అత్యధిక వయసులో ఐపీఎల్ టైటిల్‌ను నెగ్గిన జట్టు సారథిగా ధోనీ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఆయన వయసు 41 ఏళ్లు.
Ruturaj Gaikwad Records : చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్.. ఇంకో 36 పరుగులు చేస్తే ఈ సీజన్‌లో 600 రన్స్ చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కుతాడు. 600+ పరుగులు చేసి చెన్నై విజేతగా నిలిస్తే మాత్రం అదీ కూడా ఓ రికార్డు అవుతుంది. చెన్నై 2021 సీజన్ విజేతగా నిలిచినప్పుడు కూడా రుతురాజ్ 635 పరుగులు చేశాడు. ఇలా సీఎస్‌కే కప్‌ను సొంతం చేసుకున్నప్పుడు రెండుసార్లు 600కిపైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డును ఖాతాలో వేసుకుంటాడు.