Rohit Sharma Captaincy: పంజాబ్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లోనూ ముంబయి ఓటమిపాలవ్వడం వల్ల ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, ఈ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మను తప్పుబట్టాల్సిన అవసరం లేదని, అతడిని విమర్శించడం తగదని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్‌స్వాన్ అన్నాడు. ముంబయి ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదింటిలో ఓటమిపాలై ఇంకా ఖాతా తెరవలేదు. దీంతో పాయింట్ల పట్టిక చివర్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు అభిమానులు కెప్టెన్‌ను విమర్శిస్తుండటం వల్ల స్వాన్ స్పందించాడు.
"ముంబయి ఓటమికి రోహిత్ సారథ్యాన్ని శంకిస్తున్నారు. ఆ విషయంలో నేను సంతోషంగా లేను. పంజాబ్ తొలి వికెట్‌కు 97 పరుగులు చెయ్యడం.. చివరికి 198 పరుగులు సాధించడం అంటే.. ముంబయి బౌలర్లలో ఆత్మవిశ్వాసం లోపించినట్లు నాకు అనిపిస్తోంది. మధ్య ఓవర్లలో జస్ప్రిత్ బుమ్రా వచ్చి అద్భుతమైన స్పెల్ వేసేంతవరకు ఆ జట్టు బౌలర్లు మరీ దారుణంగా బౌలింగ్ చేశారు. అలాంటప్పుడు ఒక్క సెకను కూడా రోహిత్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తొలి పది ఓవర్లు అతడు ఎవరికి బంతి అందించినా బెడిసికొట్టింది"
-గ్రేమ్ స్వాన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 198/5 స్కోర్ సాధించగా ఛేదనలో ముంబయి 186/9తో సరిపెట్టుకుంది. డివాల్డ్ బ్రెవిస్ (49; 25 బంతుల్లో 4x4, 5x6), తిలక్ వర్మ (36; 20 బంతుల్లో 3x4, 2x6), సూర్యకుమార్ యాదవ్ (43; 30 బంతుల్లో 1x4, 4x6) కీలక సమయాల్లో ఔటవ్వడం వల్ల ఆ జట్టు ఓటమిపాలైంది.
రోహిత్‌కు రూ.24లక్షల జరిమానా
ఈ మ్యాచ్‌లో ముంబయి బౌలర్లు స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మకు టోర్నీ నిర్వాహకులు రూ.24 లక్షల జరిమానా విధించారు. అలాగే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 25శాతం లేదా రూ.6లక్షలు కోత పెట్టారు. స్లో ఓవర్ రేటు కారణంగా ముంబయి జట్టుకు రెండోసారి జరిమానా విధించారు.
ఇవీ చూడండి:
IPL 2022: ముంబయికి షాక్.. రోహిత్‌కు భారీ జరిమానా