Rohit Sharma: ఐపీఎల్ 2022లో ముంబయి ఇండియన్స్ పేలవ ప్రదర్శనకు తనదే పూర్తి బాధ్యత అని చెప్పాడు కెప్టెన్ రోహిత్ శర్మ. శనివారం లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ చేతిలోనూ ఓటమిపాలైన అనంతరం ఈ మేరకు పేర్కొన్నాడు. జట్టును గాడినపెట్టేందుకు ఎక్కడ దిద్దుబాటు చేపట్టాలో తెలియడంలేదని అన్నాడు.
"ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలిస్తే.. సరిచేస్తా. కానీ, అది తెలియడంలేదు. ప్రతి గేమ్‌కూ ఒకేలా సన్నద్ధమవుతా. అందులో ఏ మార్పూ లేదు. జట్టును ఏ స్థితిలో నిలపాలనే విషయమై నా మీద పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోవడానికి నాదే పూర్తి బాధ్యత. ఎప్పటిలాగే ఆటను ఆస్వాదిస్తా. భవిష్యత్‌పై దృష్టిసారించడం కీలకం. ఇంతటితో ప్రపంచం ఆగిపోలేదు. ఇంతకుముందూ గట్టిగా తిరిగొచ్చాం. ఈసారీ అందుకు ప్రయత్నిస్తాం."
-రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్
ఈ టోర్నీలో బ్యాట్‌తోనూ రాణించలేకపోయాడు రోహిత్. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 114 పరుగులు మాత్రమే చేయగలిగాడు. "ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఓడిపోయాం. సరైన కాంబినేషన్ ఏమిటని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ అది మేము ఆడే ప్రత్యర్థిపై ఆధారపడి ఉంటుంది. ఓడిపోయినప్పుడు జట్టులో చేసిన మార్పులపై వేలెత్తిచూపుతారు. కానీ, ఎప్పుడైనా మా అత్యుత్తమ 11మందితోనే బరిలోకి దిగుతాం."అని రోహిత్ చెప్పాడు.
ఇదీ చూడండి: టీమ్ఇండియా కెప్టెన్సీనే భారమా? విఫలమైంది రోహిత్ శర్మనా?