న్యూజిలాండ్ కెప్టెన్, గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బంతిని ఆపబోయి కేన్ మామ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడి మెకాలికి పెద్ద గాయమైంది. ప్రస్తుతం విలియమ్సన్ తన స్వదేశానికి పయనమయ్యాడు. అయితే న్యూజిలాండ్‌కు వెళ్లే ముందు విలియమ్సన్ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మోకాళ్లకు కట్టుతో క్రట్చెస్ సాయంతో నిలబడి ఉన్న ఫొటోను అభిమానులతో కేన్ పంచుకున్నాడు.
"థ్యాంక్యూ గుజరాత్ టైటాన్స్. ఈ కొద్ది రోజుల్లో చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లను కలిశాను. గత కొన్ని రోజులుగా నాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నేను నా స్వదేశానికి వెళ్తున్నా, త్వరలో తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను" అని ఇన్‌స్టాలో విలియమ్సన్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం విలియమ్సన్ ఫొటో అతడి అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది! కేన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు అశిస్తున్నారు. ఇక విలియమ్సన్ పోస్టుపై ఈ సురేష్ రైనా, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రుతురాజ్ గైక్వాడ్ తదితర క్రికెటర్లు సైతం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్లు చేశారు. మెకాలి గాయంతో బాధపడుతున్న విలియమ్సన్ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 5 నుంచి 6 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్-2023లో పాల్గొనడం అనుమానంగా మారింది!
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ జరిగింది..
ఐపీఎల్ లీగ్‌లో భాగంగా గుజరాత్ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్ 13వ ఓవర్లో గుజరాత్ ప్లేయర్ జోషువా లిటిల్ వేసిన బంతిని చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడాడు. దీంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కేన్ విలియమ్సన్.. గాల్లోకి ఎగిరి ఆ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే తను బ్యాలెన్స్ తప్పానని తెలుసుకున్న కేన్.. బంతిని మైదానంలోకి విసిరి తన జట్టుకు రెండు పరుగులను సేవ్ చేశాడు.
అలా బంతిని ఆపే క్రమంలో అతడి మోకాలు నేలకు బలంగా తాకింది. వెంటనే అప్రమత్తమైన మేనేజ్మెంట్.. మైదానంలోకి ఫిజియోను తీసుకొచ్చి చికిత్స అందించారు. అయినప్పటికీ అతడి నొప్పి ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఇక నొప్పితో తల్లడిల్లిపోతున్న కేన్‌ను హుటాహుటిన మైదానంలో నుంచి పెవిలియన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడి స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్ బ్యాటింగ్‌కు దిగాడు.