అబుదాబి వేదికగా ముంబయితో తలపడ్డ రాజస్థాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఛేదనలో బెన్ స్టోక్స్, సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ అందించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఇద్దరు బ్యాట్స్మెన్లపై ప్రశంసల వర్షం కురిపించాడు రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్. ఇరువురు కలిసి 152 పరుగులు జోడించడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టోక్స్ 107 పరుగులు చేయగా, సంజూ శాంసన్ 54 పరుగులతో ఆకట్టుకున్నాడు.
"స్టోక్స్-శాంసన్ కలిసి 152 పరుగులు చేసిన తీరు అద్భుతం. వారి ఆటతీరును అలా చూస్తూ ఉండిపోయా. ఇలాంటి ఆటకోసమే ఇన్నాళ్లుగా వేచి చూస్తున్నా. అనుభవాన్ని ఉపయోగించి మ్యాచ్‌లో నిమగ్నమవ్వాలి. స్టోక్స్, శాంసన్ అదే చేశారు. భారీ షాట్లతో అలరించారు."
-స్టీవ్ స్మిత్, రాజస్థాన్ జట్టు సారథి
ఇదే జోరు కొనసాగాలి
మొదట్లో బాగా ఆడినా చివర్లో 40-45 పరుగులు ముంబయి జట్టుకు అధికంగా ఇచ్చామని స్మిత్ అన్నాడు. కానీ, ఛేదనలో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ నమ్మకంతో ఆడారని.. ఇదే తీరు తర్వాత మ్యాచ్‌ల్లోనూ కొనసాగాలని అన్నాడు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 195 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందుంచింది. 21 బంతుల్లో 60 పరుగులతో హార్ధిక్ పాండ్యా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, ఛేదనలో రెచ్చిపోయిన బెన్ స్టోక్స్ తన శతకంతో జట్టును ముందుండి గెలిపించాడు.
ఇదీ చదవండి:ముంబయిపై రాజస్థాన్ అద్భుత విజయం