యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ లీగ్‌లో పంజాబ్ కథ ఆదివారంతో ముగిసిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు చెన్నై చేతిలో ఘోర పరాభవం చెందింది. దీంతో ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. అయితే.. సోమవారం పంజాబ్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ ఓ ఆసక్తికర ట్వీట్ చేసి, తన అభిమానులను అయోమయానికి గురి చేశాడు. "నా సీజన్ పూర్తయినా.. మీరంతా ఈ టీ20 లీగ్‌ను వీక్షిస్తూ తరించండి" అని పేర్కొంటూ ధన్యవాదాలు చెప్పాడు. దాంతో గందరగోళానికి గురైన గేల్ అభిమానులు.. యూనివర్స్ బాస్ రిటైర్ అవుతున్నట్లు భావించి అలా చేయొద్దని కామెంట్లు పెట్టారు.
"అయితే, మీరు రిటైర్ అవుతున్నారా? దయచేసి అలా చేయొద్దు", "మీరు ఇంకొన్ని సీజన్లు ఆడాలి", "మీరు మళ్లీ వచ్చి మమ్మల్ని అలరించాలి. ఈ ఒక్క సీజనే పూర్తయింది" అని పేర్కొన్నారు. కాగా, ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లే ఆడిన ఈ విండీస్ స్టార్ 288 పరుగులు సాధించాడు. వయసు పెరిగినా ఇంకా తనలో పరుగులు చేసే సత్తా ఉందని నిరూపించాడు. మొత్తం మూడు అర్ధ శతకాలతో పాటు రాజస్థాన్‌పై 99 పరుగులతో అలరించాడు. ఒక్క పరుగు దూరంలో ఔటైన యూనివర్స్ బాస్ ఈ లీగ్‌లో ఏడో శతకాన్ని కోల్పోయాడు. అయితే, సీజన్ ఆరంభం నుంచీ గేల్ ఆడి ఉంటే పంజాబ్ కథ మరోలా ఉండేదని పలువురు అభిమానులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:'అన్ని మ్యాచ్‌ల్లో ఆడనందుకు బాధపడ్డా'