క్రికెట్లో సాధారణంగా ఒక బంతికి చేయగల గరిష్ట పరుగులు 6. ఆ లెక్కన రెండు బంతులకు 12 పరుగులు చేయొచ్చు. అయితే మంగళవారం చెన్నైతో మ్యాచ్‌లో రాజస్థాన్ మాత్రం 2 బంతుల్లో ఏకంగా 27 పరుగులు చేసింది. ఈ అద్భుతం ఆర్చర్ కళ్లు చెదిరే బ్యాటింగ్, ఎంగిడి పేలవ బౌలింగ్ వల్ల సాధ్యమైంది. 19వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఆర్చర్‌కు ఎంగిడి వేసిన చివరి ఓవర్లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది.
ఎదుర్కొన్న తొలి బంతినే అతను బౌలర్ తలమీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతికి మరింతగా శక్తిని ప్రయోగించిన ఆర్చర్.. మిడ్‌వికెట్‌లో స్టేడియం అవతల పడేలా బంతిని కొట్టాడు. దీంతో ఒత్తిడికి గురైన ఎంగిడి మరో పేలవ బంతి వేశాడు. ఈసారి మిడ్‌వికెట్, లాంగాన్ మధ్య ఫ్లాట్ సిక్సర్ అందుకున్నాడు ఆర్చర్. ఇది నోబాల్ కూడా కావడంతో ఫ్రీహిట్ వచ్చింది. బౌలర్ తల మీదుగా మరో సిక్సర్ బాదేశాడు. ఇది కూడా నోబాలే కావడంతో మళ్లీ ఫ్రీహిట్ వచ్చింది. తర్వాత వైడ్ వేయడంతో ఫ్రీహిట్ కొనసాగింది. చివరికి డాట్ బాల్ వేసి బయటపడ్డాడు. అంటే అధికారికంగా మూడో బంతి పడటానికి ముందే.. ఈ ఓవర్లో 27 పరుగులు (6, 6, 6+1, 6+1, 1) వచ్చాయి. చివరి 4 బంతుల్లో మూడే పరుగులు ఇవ్వడం ద్వారా ఎంగిడి ఈ ఓవర్లో 30 పరుగులతో సరిపెట్టుకున్నాడు.