Arshdeep singh Khalistan edit : ఖలిస్థాన్ ఉద్యమంతో క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్‌కు ముడిపెడుతూ వికీపీడియాలో సమాచారాన్ని ఉంచడంపై భారత ప్రభుత్వం మండిపడింది. ఈ తప్పుడు పోస్టుపై తక్షణం వివరణ ఇవ్వాల్సిందిగా వికీపీడియాను ఆదేశించింది. ఈ మేరకు ఆ సంస్థకు నోటీసులు పంపించింది. ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య సూపర్-4 సమరంలో పేసర్ అర్ష్‌దీప్ కీలక సమయంలో క్యాచ్ వదిలి పెట్టిన కాసేపటికే ఖలిస్థాన్ ఉద్యమంతో అతడికి ముడిపెడుతూ వికీపీడియాలో అతడి ప్రొఫైల్‌లో మార్పులు వచ్చాయి. దీన్ని గమనించిన వికీపీడియా ఎడిటర్లు 15 నిమిషాల్లోే తొలగించారు. "తప్పుడు సమాచారాన్ని భారత్ ఆమోదించదు. వ్యక్తులకు హాని కలిగించేలా చేసే ఇలాంటి ప్రేరేపణలు.. ఇంటర్నెట్ సురక్షితం, నమ్మదగినది అనే ప్రభుత్వ అంచనాలను వమ్ము చేసేలా ఉన్నాయి" అని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ చెప్పింది.
అర్ష్‌దీప్‌కు చెందిన వికీపీడియా ప్రొఫైల్ పేజీలో భారత్ స్థానంలో ఖలిస్థాన్ అని చేర్చడమే కాక అతడి పేరును 'మేజర్ అర్ష్‌దీప్ సింగ్ బజ్వా' అని మార్చారు. భారత్‌లో విద్వేషాలను రెచ్చగొట్టడానికి పాకిస్థాన్‌కు చెందినవాళ్లే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మరోవైపు అర్ష్‌దీప్‌పై తప్పుడు ప్రచారాన్ని పలువురు క్రికెటర్లు, రాజకీయ నాయకులు ఖండించారు. అతడికి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు. భారత్‌తో మ్యాచ్‌లో విజయానికి పాక్‌కు 34 పరుగులు అవసరమైన స్థితిలో 18వ ఓవర్లో అసిఫ్ అలీ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను అర్ష్‌దీప్ విడిచిపెట్టాడు. చివరి ఓవర్లో పాక్ 7 పరుగులు చేయాల్సి ఉండగా.. బంతిని అందుకున్న అర్ష్‌దీప్ పాక్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయాడు.
ఇదీ చదవండి:
లంకపై పోరుకు సిద్ధమైన భారత్.. నిలవాలంటే గెలవాల్సిందే..
అర్ష్‌దీప్ క్యాచ్ మిస్.. రోహిత్ సీరియస్.. వీడియో వైరల్