IND vs WI 2022: విరాట్ కోహ్లీ నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత మొదటిసారిగా రోహిత్ శర్మ మీడియాతో సమావేశమయ్యాడు. విండీస్‌తో ఆదివారం జరిగే తొలి వన్డేకు సంబంధించి జట్టు కూర్పుపై వివరాలు వెల్లడించాడు. శిఖర్ ధావన్ కరోనా బారిన పడిన నేపథ్యంలో అతడి స్థానంలో యువక్రికెటర్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్‌కు దిగుతున్నట్లు తెలిపాడు. మయాంక్‌కు ఇంకా క్వారంటైన్ వ్యవధి పూర్తికాని నేపథ్యంలో ఓపెనర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇషాన్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నాడు.
"విరాట్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేను వైస్‌కెప్టెన్‌గా ఉన్నాను. ఇప్పుడు నేను ఆ బాధ్యతలు అందుకున్నాను. జట్టు నుంచి ఏం ఆశిస్తారో మాకు తెలుసు. విరాట్ వదిలేసిన పగ్గాలను అందుకుని జట్టును ముందుకు నడిపించడమే నా బాధ్యత. అంతకుమించి ఎలాంటి మార్పులు చేయదలచుకోలేదు. ప్రస్తుతం నా దృష్టి విండీస్‌తో వన్డే, టీ20లకు టీమ్ఇండియా తరపున సారథ్యం వహించడమే. టెస్టు కెప్టెన్సీపై నాకు ఎలాంటి ఆలోచనా లేదు."
-రోహిత్ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్
వాళ్లు వన్డేల్లో లేనట్టే..
కరోనా బారిన పడిన కీలక ఆటగాళ్లు శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్లు వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందన్నాడు రోహిత్. ఐసొలేషన్‌లో ఉన్న ఆ ముగ్గురూ కోలుకుంటున్నారని కానీ చివరిక్షణం వరకు ఏమీ చెప్పలేమని పేర్కొన్నాడు.
అందరూ సిద్ధంగా ఉండాలి..
రిజర్వ్ ఆటగాళ్లు కూడా జట్టులో ఆడేందుకు సిద్ధంగా ఉండాలని రోహిత్ సూచించాడు. "కొవిడ్ వల్ల పరిస్థితులు మారొచ్చు. ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో తెలియదు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని వాళ్లు సన్నద్ధం కావాలి. ఈ విషయంపై ఆటగాళ్లకు ఇదివరకే స్పష్టం చేశాను." అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి : భారత సంతతి కుర్రాడు అదరహో.. అఫ్గాన్‌పై ఆసీస్ విజయం