IND vs SL Test series Teamindia combination: టీమ్ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టాక వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. మార్చి 4 నుంచి శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు తొలిసారి సారథ్యం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల కూర్పు, ఎవరెవరిని ఏ స్థానంలో బ్యాటింగ్‌కి పంపాలనే విషయాన్ని ఓ సారి పరిశీలిద్దాం.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారాలను శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు దూరం పెట్టడంతో.. జట్టులో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేసేందుకు శుభ్‌మన్ గిల్, హనుమ విహారిలతో పాటు శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతున్నాడు. అయితే, ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తర్వాత.. గిల్‌ని మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే, మూడో స్థానంలో అతడు మెరుగ్గా రాణించగలడు. అవసరమైతే ఓపెనింగ్ కూడా చేయగలడు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మకి మయాంక్ అగర్వాల్ తోడుగా ఉన్నాడు. కాబట్టి, గిల్ మూడో స్థానంలో ఆడనున్నాడు. ఇండియా-ఎ జట్టు తరఫున ఆడుతున్న సమయంలో అతడు మూడో స్థానంలో బరిలోకి దిగి డబుల్ సెంచరీ సాధించాడు. కాబట్టి, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అతడిని మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కి దింపేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పలువురు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేశాడు.

ఆరో స్థానంలో విహారి..
మరోవైపు సీనియర్ ఆటగాడు అజింక్య రహానె (ఐదో) స్థానంలో రిషభ్ పంత్ బరిలోకి దిగనున్నాడు. ఆరో స్థానంలో హనుమ విహారి ఆడనున్నాడు. టీమ్ఇండియా టాప్ ఆర్డర్ ఆటగాళ్లంతా (మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ) రైట్ హ్యాండ్ బ్యాటర్లే. అందుకే, ఐదో స్థానంలో ఎడమ చేతి వాటం ఆటగాడు రిషభ్ పంత్, ఆరో స్థానంలో హనుమ విహారిని బరిలోకి దింపితే.. కుడి, ఎడమ కాంబినేషన్ కుదురుతుంది. ఆ తర్వాత రవీంద్ర జడేజాను ఏడో స్థానంలో ఆడతాడు. ఇప్పటి వరకు హనుమ విహారి సొంత గడ్డపై ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు. ఇండియా-ఎ, ఇండియా జట్ల తరఫున అతడు విదేశాల్లో ఆడిన టెస్టుల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి దిగాడు. సొంత గడ్డపై ఆరో స్థానంలో ఆడాడు. విహారి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోగలడు. కాబట్టి, అతడిని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి దింపే అవకాశం ఉంది. కాగా, అరంగేట్ర టెస్టులోనే శతకంతో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్‌కి మరి కొంత కాలం వేచి చూడక తప్పకపోవచ్చు. గిల్, విహారి ఇద్దరిలో ఎవరో ఒకరు గాయపడితే తప్ప.. శ్రేయస్‌కి చోటు దక్కడం కష్టమే.
తుది జట్టు కూర్పు ఇలా.!
రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ (ఫిట్‌గా ఉంటే)/జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్
ఇదీ చదవండి: Womens World cup 2022: ప్రపంచకప్.. మిథాలీ కల తీరేనా