IND vs SL 2nd T20: పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత జట్టు విజృంభిస్తోంది. ముఖ్యంగా టీ20ల్లో గతకొన్ని నెలలుగా టీమ్ఇండియాకు ఏ జట్టూ ఎదురు నిలవలేకపోతోంది. శ్రీలంకతో గురువారం జరిగిన టీ20లో కూడా ప్రత్యర్థిని చిత్తు చేసి విజయాల పరంపరను టీమ్ఇండియా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు టీ20ల్లో కూడా భారత్ గెలిస్తే ఈ ఫార్మాట్లో అత్యధిక వరుస విజయాలు నమోదు చేసిన జట్టుగా నిలుస్తుంది. ప్రస్తుతం ఆ రికార్డు అఫ్గానిస్థాన్ పేరిట ఉంది. ఆ జట్టు వరుసగా 12 టీ20ల్లో గెలిచింది.
ఈ టీ20లో టీమ్ఇండియా విజయం సాధిస్తే ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు నమోదు చేసిన పాకిస్థాన్ సరసన చేరుతుంది. పాకిస్థాన్, జింబాబ్వేపై 16 సార్లు గెలిచింది. శ్రీలంకపై భారత్ 15 సార్లు విజయం సాధించింది.
కోహ్లీ రికార్డ్ బ్రేక్!
రెండో టీ20 సందర్భంగా మరికొన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.
- కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి నుంచి జట్టుకు వరుస విజయాలు అందిస్తున్న రోహిత్ శర్మ.. సొంతగడ్డపై 15 టీ20 విజయాలు సాధించి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్‌తో సమానంగా అగ్రస్థానాన్ని పంచుకుంటున్నాడు. రెండో టీ20లో విజయం సాధిస్తే ఈ రికార్డు తిరగరాసే అవకాశం ఉంది.
- మరో 8 ఫోర్లు బాదితే టీ20ల్లో రోహిత్ శర్మ 300 ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరుతాడు. ఏడు ఫోర్లు కొడితే విరాట్ కోహ్లీ (298) ఫోర్ల రికార్డును బద్దలు కొట్టి టీ20ల్లో అత్యధిక ఫోర్లు బాదిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.
- రెండో టీ20తో రోహిత్ శర్మ.. 124 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ సరసన చేరుతాడు. మరో క్యాచ్ పడితే అంతర్జాతీయ టీ20ల్లో 50 క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా నిలుస్తాడు.
- మరో 19 పరుగులు చేస్తే కెప్టెన్‌గా 1000 టీ20 పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలుస్తాడు.
- ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మరో ఐదు వికెట్లు తీస్తే స్పిన్ దిగ్గజం రవి అశ్విన్ రికార్డును బద్దలు కొడతాడు. 61 వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. భువీ ఇప్పటివరకు 57 వికెట్లు పడగొట్టాడు.
- మరో మూడు వికెట్లు తీస్తే టీ20ల్లో 50 వికెట్లు తీసిన ఆటగాడిగా స్పిన్నర్ రవీంద్ర జడేజా నిలుస్తాడు. ఇప్పటివరకు జడేజా 47 వికెట్లు పడగొట్టాడు.
ఇదీ చూడండి : IND VS SL: సిరీస్ నుంచి వైదొలిగిన గైక్వాడ్... మయాంక్‌కు ఛాన్స్