Sanjay Bangar on Hanuma Vihari: విదేశీ పిచ్‌లపై హనుమ విహారికి మెరుగైన రికార్డు ఉందని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. అందుకే దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో అతడిని శ్రేయస్ అయ్యర్ కంటే ముందే బ్యాటింగ్‌కు పంపించాలని సూచించాడు. అక్కడి కఠిన పిచ్‌లపై కూడా విహారి సమర్థంగా రాణించగలడని పేర్కొన్నాడు.
"దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి ఇద్దరూ తుది జట్టులో చోటు దక్కించుకుని.. ఎవరిని ముందుగా బ్యాటింగ్‌కు పంపించాలన్న సంధిగ్ధ పరిస్థితి నెలకొంటే.. కచ్చితంగా విహారినే ముందుగా బ్యాటింగ్‌కు పంపించాలి. ఎందుకంటే అతడు విదేశీ పిచ్‌లపై మెరుగ్గా రాణించగలడు. కఠినమైన పిచ్‌లపై కూడా నిలకడగా ఆడగలడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విహారి శతకం నమోదు చేశాడు. ఆ తర్వాత సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సంయమనంతో ఆడుతూ టీమ్‌ఇండియాను ఓటమి నుంచి తప్పించాడు."
-సంజయ్ బంగర్, టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్
ఇప్పటి వరకు 12 టెస్టు మ్యాచులు ఆడిన హనుమ విహారి.. 32.84 సగటుతో 624 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం పాటు నాలుగు అర్ధ శతకాలున్నాయి. కాగా, ఇప్పటి వరకు విహారి ఆడిన 12 టెస్టు మ్యాచులు కూడా విదేశాల్లోనే కావడం విశేషం. ఆస్ట్రేలియాలో ఆరు, న్యూజిలాండ్, వెస్టిండీస్‌ల్లో రెండేసి, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల్లో ఒక్కో మ్యాచ్ ఆడాడు.