IND VS ENG Second T20: పేలవ ఫామ్‌తో సతమతం అవుతున్న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. మరో పరీక్షకు సిద్ధమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టులో చోటు నిలబెట్టుకోవాలంటే తప్పక రాణించాల్సిన స్థితిలో అతను ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో బరిలోకి దిగుతున్నాడు. యువ ఆటగాళ్ల దూకుడుతో జట్టులో ప్రతి స్థానానికీ పోటీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో మెరుగ్గా ఆడటం కోహ్లికి ఎంతో కీలకం.
భీకర బ్యాట్స్‌మెన్‌తో నిండిన ఇంగ్లాండ్‌తో కఠిన సవాలు తప్పదనుకున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను అలవోకగా గెలుచుకుంది టీమ్‌ఇండియా. అదే ఊపులో సిరీస్ సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో శనివారం రెండో టీ20లో బరిలోకి దిగనుంది. ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడడంతో తొలి టీ20కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నారు. వీరిలో ప్రధానంగా కోహ్లి మీదే అందరి దృష్టి నిలిచి ఉంది. రెండేళ్లకు పైగా ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయని అతను.. ఇటీవల మరీ తీసికట్టుగా ఆడుతున్నాడు. అర్ధశతకాలు కూడా కరవైపోతున్నాయి. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 31 పరుగులే చేశాడు. గత ఏడాది టీ20ల్లో తాను చివరగా కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రపంచకప్ తర్వాత అతను ఈ ఫార్మాట్లో ఆడింది రెండే మ్యాచ్‌లు. త్వరలో వెస్టిండీస్ పర్యటనకూ దూరం కానున్నాడని వార్తలొచ్చాయి. దీపక్ హుడా, ఇషాన్ కిషన్ లాంటి కుర్రాళ్లు అదరగొడుతుండటం, సూర్యకుమార్ జట్టులో కుదురుకోవడం, హార్దిక్ పాండ్య సైతం పూర్వపు ఫామ్‌ను అందుకోవడంతో కోహ్లికి తుది జట్టులో చోటుపై ఇప్పటికే చర్చ జోరందుకుంది. ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు రేసులో ఉండాలంటే ఇంగ్లాండ్‌తో చివరి రెండు టీ20ల్లో అతను సత్తా చాటాల్సిందే.
ఖాళీ చేసేదెవరు?: కోహ్లితో పాటు బుమ్రా, పంత్, జడేజా ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తుండగా.. అందరినీ తుది జట్టులో ఆడిస్తారా, ఆడిస్తే వారి కోసం స్థానాలు ఖాళీ చేసేదెవరు అన్నది ఆసక్తికరం. ఐర్లాండ్‌తో రెండు టీ20ల్లో, ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో కోహ్లి ఆడే మూడో స్థానంలో దీపక్ హుడా ఆడాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ అతను అదరగొట్టాడు. అంత మంచి ఫామ్‌లో ఉన్న హుడాను తప్పించడం ఇబ్బందే. కానీ తప్పకపోవచ్చు. పంత్ కోసం దినేశ్ కార్తీక్‌ను తప్పిస్తారా.. లేక ఇషాన్‌పై వేటు వేస్తారా అన్నది చూడాలి. ఇషాన్‌పై వేటు పడితే కోహ్లి ఓపెనింగ్‌లో వచ్చే అవకాశముంది. గురువారమే అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. మిగతా రెండు టీ20ల కోసం ఎంపిక చేసిన జట్టులో లేడు. అతడి స్థానంలో బుమ్రా ఆడనున్నాడు. అక్షర్ స్థానంలో జడేజాను ఆడించొచ్చు.
అంత వీజీ కాదు: తొలి టీ20లో భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఇంగ్లాండ్.. 148 పరుగులకే కుప్పకూలింది. మొయిన్ అలీ (36), బ్రూక్ (28), జోర్డాన్ (26 నాటౌట్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. అయితే ఈ మ్యాచ్ ఏకపక్షం అయినంత మాత్రాన ఇంగ్లాండ్‌తో అంత తేలిక కాదు. బట్లర్, రాయ్, మలన్, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ.. వీళ్లంతా ఎవరికి వారు ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించగల విధ్వంసకారులే.కాబట్టి భారత బౌలర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే. హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేయడం, ముఖ్యంగా బంతితో విజృంభిస్తూ 4 వికెట్లు పడగొట్టడం భారత్‌కు అతి పెద్ద సానుకూలాంశం. భువనేశ్వర్ (1/10), హర్షల్ (1/24), చాహల్ (2/32) కూడా తొలి టీ20లో చక్కగా బౌలింగ్ చేశారు. అర్ష్‌దీప్ (2/18) అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. మిగతా రెండు టీ20లకు అతడు జట్టులో లేడు. ఎదురుదాడి చేసే అవకాశమున్న ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌కు ఈ బృందం మరోసారి కళ్లెం వేస్తుందేమో చూడాలి. తొలి టీ20లో ఇంగ్లాండ్ బౌలింగ్ తేలిపోయింది. కాబట్టి ఒకట్రెండు మార్పులు చేసే అవకాశం లేకపోలేదు. టాప్లీ, మిల్స్‌లపై వేటు వేసి పేసర్లు విల్లీ, గ్లీషన్‌లను ఆడించే ప్రయత్నం చేయొచ్చు. రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, హార్దిక్‌ల నుంచి భారత్ పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తోంది.
పిచ్.. వాతావరణం.. రెండో టీ20కి వేదికైన ఎడ్జ్‌బాస్టన్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. పేసర్లకూ సహకారం ఉంటుంది. మ్యాచ్‌కు వర్షం బెడద తక్కువే. ఇక్కడ ఇంగ్లాండ్‌తో భారత్ ఒక టీ20 ఆడింది. 2014లో జరిగిన ఆ మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో ఓడింది. ఇంగ్లాండ్ 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. భారత్ 177/5కు పరిమితమైంది. కోహ్లి (66) టీమ్‌ఇండియా తరఫున టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), కోహ్లి, ఇషాన్/దీపక్, సూర్యకుమార్, హార్దిక్, పంత్/కార్తీక్, జడేజా/అక్షర్, చాహల్, భువనేశ్వర్, బుమ్రా, హర్షల్ పటేల్.
ఇంగ్లాండ్: బట్లర్ (కెప్టెన్), రాయ్, మలన్, లివింగ్‌స్టోన్, బ్రూక్, మొయిన్ అలీ, సామ్ కరన్, జోర్డాన్, టాప్లీ, మిల్స్/విలీ, పార్కిన్సన్.
ఇదీ చూడండి: అలా జరగడం టీమ్ఇండియాకు మంచిది కాదు.. కానీ: దాదా