ICC T20 Ranking : టీ20లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది ఐసీసీ. భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 10 స్థానాలు మెరుగుపర్చుకొని 23వ స్థానాన్ని సంపాదించుకున్నాడు. మరో బ్యాటర్ దీపక్ హుడా 374 పాయింట్లతో 97వ ర్యాంకును దక్కించుకున్నాడు. మంగళవారం ముంబయి వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనతో ఏకంగా 40 స్థానాలను ఎగబాకాడు దీపక్ హుడా.
టాప్ బ్యాటర్లు వీరే..
పురుషుల టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో దీపక్ హుడా 40 స్థానాలు ఎగబాకి 97వ స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమ్‌ఇండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా పది స్థానాలను మెరుగుపర్చుకొని 23వ ర్యాంక్‌కు చేరాడు. ఇషాన్ (567 పాయింట్లు) లంకపై 39 పరుగులతో మంచి ప్రదర్శనే ఇచ్చాడు. ఇక తొలి స్థానం సూర్యకుమార్ యాదవ్‌దే (883 పాయింట్లు). లంకతో ఈ సిరీస్‌లో సూర్య ప్రదర్శనతో సంబంధం లేకుండా మొదటి ర్యాంక్ కొనసాగుతుంది. రెండో స్థానంలో ఉన్న మహమ్మద్ రిజ్వాన్ (836)కి సూర్యకుమార్‌కు మధ్య తేడా భారీగానే ఉంది. టాప్ -10లో సూర్య తప్ప ఇతర భారత ఆటగాళ్లు ఎవరూ లేరు. ఇక భారత కొత్త టీ20 సారథి హార్దిక్ పాండ్య, బౌలర్లలో 76వ ర్యాంక్‌ను చేజిక్కించుకున్నాడు.
టాప్-10లో లేని భారత బౌలర్లు..
ఐసీసీ బౌలర్ల విభాగంలో టాప్ -10 జాబితాలో ఒక్కరూ టీమ్ఇండియా నుంచి లేకపోవడం గమనార్హం. హార్దిక్ పాండ్య పది స్థానాలను మెరుగుపర్చుకొని 76వ ర్యాంక్ అందుకొన్నాడు. టీమ్‌ఇండియా ఉత్తమ ప్రదర్శన చేసిన శ్రీలంక బౌలర్ హసరంగ (709 పాయింట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత రషీద్ ఖాన్ (698) ఉన్నాడు. భారత్ నుంచి భువనేశ్వర్ కుమార్ (641) మాత్రమే 11వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమ్‌ఇండియా నుంచి హార్దిక్ పాండ్య (209) మూడో ర్యాంక్‌లో నిలిచాడు. వనిందు హసరంగ (182) రెండు స్థానాలను మెరుగుపర్చుకొని ఐదుకి చేరాడు. బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ (252) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు.
ఆల్‌రౌండర్లు అదరహో..
ఆల్‌రౌండర్ల జాబితాలో టీమ్ ఇండియా నుంచి హార్దిక్ పాండ్య 209 పాంట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 25 ఏళ్ల వనిందు హసరంగ 182 పాయింట్స్‌తో ఐదో స్థానం వద్ద స్థిరపడ్డాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ 252 మెరుగైన పాయింట్స్‌తో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు.
వీళ్లూ తక్కువేం కాదు..
ఇక బ్యాటర్ల టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ మార్నస్ లబుషేన్ ఆధిక్యంతో కొనసాగుతున్నాడు. మార్నస్ తర్వాత స్టీవ్ స్మిత్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తో పాటు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు ఉన్నారు. న్యూజిలాండ్ ఆటగాడు విలియమ్సన్ తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్తుకొని ఐదో స్థానంలో ఉన్నాడు.