Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎందరికో ఉపయోగపడే ఓ పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
"1992లో క్రికెట్లో అడుగుపెట్టాను. 2022తో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నా. నాటి నుంచి క్రికెట్ నాకెంతో ఇచ్చింది. మరీ ముఖ్యంగా మీ మద్దతును నాకు అందించింది. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి నాకు సహకరించిన, నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎందరికో ఉపయోగపడే ఓ పని ప్రారంభించాలని ఈ రోజు నిర్ణయించుకున్నా. నా జీవితంలో ఈ సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న వేళ మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా" అని దాదా ట్వీట్ చేశారు.
బీసీసీఐ పదవికి రాజీనామా చేస్తారా?: అయితే గంగూలీ.. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెడతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దాదా.. భాజపాలో చేరనున్నారని పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఆయనను రాజ్యసభకు పంపిస్తారని ఊహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయనున్నారనేది గంగూలీనే త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అవన్నీ అవాస్తవాలే: మరోవైపు.. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా చేయనున్నారనే ఊహాగానాలను కొట్టిపారేశారు ఆ సంస్థ కార్యదర్శి జైషా. అవన్నీ అవాస్తవాలేనని, గంగూలీ రాజీనామా చేయలేదని స్పష్టంచేశారు. టీమ్ఇండియా తదుపరి ప్రాజెక్టులపైనే ప్రస్తుతం దృష్టి సారించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఆ కీలక పదవి కోసం గంగూలీ వర్సెస్ జై షా?