Hardik Pandya: గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియాలో చోటు కోల్పోయి తిరిగి బలంగా వచ్చాడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య. అయితే, అందుకోసం అతడెన్నో త్యాగాలు చేశానని చెప్పుకొచ్చాడు. ఇటీవల ముగిసిన భారత టీ20 లీగ్ 15వ సీజన్‌లో గుజరాత్ లాంటి కొత్త జట్టును ఛాంపియన్‌గా నిలిపిన పాండ్య తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ మెరుస్తున్నాడు. తొలి టీ20లో అతడు మెరుపు బ్యాటింగ్ చేసి జట్టు 200పై చిలుకు స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన పాండ్య.. తాను ఇలా బలంగా తిరిగి రావడానికి ఎంతో కష్టపడ్డానని చెప్పాడు.
'నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. దీనికన్నా ముందు ఇలా బలంగా తిరిగి రావడానికి చేసిన కృషి ఇంకా సంతృప్తినిచ్చింది. అది నన్ను నేను మెరుగుపర్చుకోవడానికి చేసిన యుద్ధం కన్నా ఎక్కువ. భారత టీ20 లీగ్‌లో తొలి సీజన్‌లోనే ట్రోఫీ సాధించడం అమితానందాన్ని ఇచ్చింది. నాకైతే మేం క్వాలిఫై అవ్వడం కూడా పెద్ద విశేషమే. చాలా మంది మా జట్టును చూసి విమర్శించారు. టోర్నీ ప్రారంభానికి ముందే మమ్మల్ని పక్కనపెట్టేశారు. వాళ్లందరికీ నేను సమాధానం ఇవ్వడం కన్నా.. ఇలా తిరిగి రావడానికి చేసిన కృషికే గర్వపడుతున్నా. అందుకోసం ఉదయం 5 గంటలకే లేచి ప్రాక్టీస్ చేసేవాడిని. మళ్లీ సాయంత్రం నాలుగింటికి చేసేవాడిని. నాలుగు నెలల పాటు రాత్రి 9:30 గంటలకే నిద్రపోయేవాడిని. అలా ఎన్నో త్యాగాలు చేశాక వచ్చిన ఫలితాలను చూసి సంతృప్తిగా ఉంది' అని పాండ్య వివరించాడు.
'అలాగే టీమ్‌ఇండియాకు తిరిగి రావడం ప్రత్యేకంగా ఉంది, చాలా కాలం తర్వాత దేశం తరఫున బరిలోకి దిగడం సంతోషంగా ఉంది. నా కష్టానికి తగిన ప్రతిఫలం చూపించే చక్కటి అవకాశం ఇప్పుడు దొరికింది. టీమ్‌ఇండియా తరఫున రాణించడం అన్నింటికన్నా ముఖ్యమైంది. దీంతో రాబోయే రోజుల్లో మరింత బాగా ఆడాలని భావిస్తున్నా. నా జీవితంలో ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. నేనెప్పుడూ కష్టాన్నే నమ్ముకున్నా. ఫలితాల గురించి ఆలోచించలేదు. నేను ఏదైనా ప్రత్యేకంగా చేసినప్పుడు ఎక్కువగా భావోద్వేగం చెందను. ఎందుకంటే అది ఆ ఒక్క సందర్భానికి సంబంధించింది కాదని భావిస్తా. నేను చేసిన కృషిలో అదొక భాగమని అనుకుంటా' అని పాండ్య పేర్కొన్నాడు.
ఇవీ చదవండి: బాబర్ అజామ్ సూపర్ రికార్డు.. కానీ అతడిపై సహచర క్రికెటర్ ఫైర్!