ప్రస్తుతం సాధారణంగానే యూపీఐ లావాదేవీలు జోరుగా సాగుతుంటాయి. ఇక పండగ సమయాల్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆన్లైన్ షాపింగ్‌లు అంటూ మరింత వేగంగా జరుగుతుంటాయి. అయితే ఈ యూపీఐ ట్రాన్స్క్షసన్స్.. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ కారణంగా ఒక్కసారిగా పడిపోయాయి. ఈ విషయాన్ని మ్యాక్స్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మిహిర్ వోరా సోషల్‌మీడియా ద్వారా తెలిపారు.
ఏం జరిగిందంటే.. ఆదివారం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శనతో.. టీమ్ఇండియా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందుకుంది. దీంతో భారత క్రికెట్ ప్రేమికులందరికీ ఒకరోజు ముందే దీపావళి పండగ వచ్చేసింది. బాంబులు కాలుస్తూ సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే సాధారణంగా పండగ అంటే కొన్ని రోజుల ముందు నుంచే ఆన్లైన్ షాపింగ్ అమ్మకాలు కాస్త ఎక్కువగానే జరుగుతుంటాయి. ఇక పండగ ముందు రోజు అంటే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూపీఐ ట్రాన్స్క్షసన్స్ లావాదేవీలు జోరుగా సాగుతుంటాయి. కానీ ఈ సారి దీపావళి ముందు రోజు అలా జరగలేదు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగడం అందులోనూ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన చేయడం వల్ల అందరూ ఫోన్లకు టీవీలకు అతుక్కుపోయారు. దీంతో ఉదయం 9 నుంచి మ్యాచ్ ప్రారంభ సమయం మధ్యాహ్నం 1:30 గంటల వరకు బాగానే సాగిన ట్రాన్స్క్షసన్స్ ఒక్కసారిగా మ్యాచ్ ప్రారంభమయ్యాక తగ్గుముఖం పట్టాయి. మరీ ముఖ్యంగా చివర్లో విరాట్ తన సంచలన ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించే దిశగా తీసుకెళ్తున్నప్పుడు, యూపీఐ లావాదేవీలు ఢమాల్ అయినట్లు మిహిర్ వోరా ట్వీట్లో పేర్కొన్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే, లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు.. విరాట్ కోహ్లీ వల్లే దేశవ్యాప్తంగా షాపింగ్ ఆగిపోయిందనే క్యాప్షన్ కూడా పెట్టారు.
రికార్డ్ వ్యూయర్షిప్.. సాధారణంగానే.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అన్నప్పుడు భారతీయ క్రీడాభిమానులు టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు. అలాంటిది.. నిన్న నరాలు తెగే థ్రిల్లింగ్ మ్యాచ్ కొనసాగడం, కోహ్లీ విజృంభించడంతో మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపించారు. డిస్నీ+ హాట్‌స్టార్ చరిత్రలో ఎన్నడూ లేనంత 1.80 కోట్ల మంది వీక్షించారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్ స్టార్‌లో ఇదే అత్యధిక వ్యూయర్షిప్ కావడం విశేషం.
ఇదీ చూడండి: భారత్-పాక్ మ్యాచ్ బ్లాక్‌బస్టర్ రికార్డ్.. ఇదే తొలిసారి