టీ20 ప్రపంచకప్ ముంగిట టీమ్‌ఇండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే రవీంద్ర జడేజా, బుమ్రా ఈ టోర్నీకి దూరం కాగా.. తాజాగా ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ కూడా గాయం కారణంగా జట్టు నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. కనీసం టీ20 ప్రపంచకప్ నాటికైనా కోలుకుంటాడని భావించినప్పటికీ.. ఆ అవకాశం కనిపించడం లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
బుమ్రా, దీపక్ చాహర్ స్థానాల్లో మహమ్మద్ షమీతోపాటు సిరాజ్ టీమ్‌ఇండియాతో కలిసే అవకాశాలున్నాయి. అయితే, వీరిద్దరిలో ఎవరు ప్రధాన జట్టులోకి వస్తారనేది బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే వారిద్దరే కాకుండా శార్దూల్ ఠాకూర్‌ను కూడా ఆస్ట్రేలియాకు పంపొచ్చు. అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. "చాహర్ ఫిట్‌నెస్ సాధించడానికి సమయం పట్టేలా ఉంది. వెన్ను నొప్పి మళ్లీ తిరగబెట్టినట్లుంది. అందుకే, బీసీసీఐ ముగ్గురు ఆటగాళ్లను ఆస్ట్రేలియాకు పంపించనుంది. షమీ, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ వెళ్తారు" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. చాహర్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. దీపక్ బదులు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన సిరాజ్ అద్భుతంగా రాణించాడు.
ఇవీ చదవండి: స్టార్ ఫుట్‌బాలర్ తలకు గాయం.. రక్తంతో ఆస్పత్రికి.. 20కి పైగా కుట్లు!
చిన్నారి అథ్లెట్ అద్భుత విన్యాసాలు.. 36వ జాతీయ క్రీడల్లో రికార్డ్