సెల్ఫీ ఇవ్వనందుకు.. టీమ్ఇండియా క్రికెటర్ పృథ్వీ షాను వెంబడించి కొందరు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదంలో కొత్త మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేసిన సోషల్‌మీడియా ఇన్ఫ్లుయిన్సర్ సప్నా గిల్ తరఫు న్యాయవాది.. సంచలన ఆరోపణలు చేశారు. పృథ్వీ షా.. మద్యం తాగి బ్యాట్‌తో దాడి చేశాడని ఆరోపించారు.
"ఫైవ్ స్టార్ హోటల్లో సప్నా గిల్.. సెల్ఫీ తీసుకునేందుకు పృథ్వీ షా దగ్గరకు వెళ్లింది. అప్పుడు వారంతా పార్టీ చేసుకుంటున్నారు. ఆ సమయంలో షా కూడా మద్యం సేవించి ఉన్నాడు. అప్పుడు తన దగ్గర ఉన్న బ్యాట్‌తో సప్నాపై దాడి చేశాడు. తర్వాత రోజు.. ఆమెపైనే కేసు పెట్టాడు. ఇప్పుడు అతడిపై మేము కేసు పెడతాం. మద్యం సేవించి అతడు కారు నడిపాడు. బైక్‌ను కూడా ఢీకొన్నట్లు తెలిసింది. సప్నా, పృథ్వీ షా మధ్య ఎలాంటి పరిచయం లేదు" అని సప్నా గిల్ లాయర్ అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ తెలిపారు.
ఇదీ జరిగింది!
పోలీసుల సమాచారం ప్రకారం.. స్టార్ ఆటగాడు పృథ్వీ షా తన స్నేహితుడు సురేంద్రతో కలిసి బుధవారం రాత్రి ముంబయిలో శాంతా క్రూజ్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ షాను చూసిన కొందరూ సెల్ఫీ దిగేందుకు ముందుకొచ్చారు. అయితే అక్కడున్న ఇద్దరితో మాత్రమే సెల్ఫీ దిగేందుకు పృథ్వీ ఆసక్తి చూపించడం వల్ల మిగతా వారు అసహనం వ్యక్తం చేశారు. తమతో కూడా ఫొటో దిగాలని కోరారు. దానికి షా నిరాకరించడం వల్ల సదరు వ్యక్తులు తమకు సెల్ఫీ ఇచ్చే తీరాలంటూ డిమాండ్ చేశారు. దీంతో అక్కడే ఉన్న షా స్నేహితుడు హోటల్ మేనేజర్‌కు కంప్లైంట్ చేశాడు. అక్కడికి వచ్చిన మేనేజర్ నిందితులను వెళ్లగొట్టాడు.
ఇదంతా మనసులో పెట్టుకున్న నిందితుల్లోని ఓ మహిళ.. షా కారును వెంబడించింది. అంతే కాకుండా అతడితో వాగ్వవాదానికి దిగింది. అతడిపై దాడి కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం గురించి షా స్నేహితుడు సురేంద్ర స్పందించాడు. తమ వద్ద నుంచి రూ. 50 వేలు డిమాండ్ చేసిందని అతడు తెలిపాడు. ఒక వేళ ఆ డబ్బును తాము ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించిందని చెప్పాడు. ఇక చేసేదేం లేక నిందితులపై షా స్నేహితుడు ముంబయి ఓషివారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హోటల్ సిబ్బందిని విచారించి నిందితుల్లో ఇద్దరైన సనా అలియాస్ సప్నా గిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.