ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చూపిస్తున్న టీమిండియా.. మూడు ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ దూసుకెళ్తోంది. టెస్టుల్లో అగ్రస్థానం, వన్డే, టీ20ల్లో రెండులో ప్రస్తుతం కొనసాగుతోంది. అన్ని చోట్లా ఆకట్టుకునే భారత్.. కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో మాత్రం తుదిమెట్టుపై బోల్తాపడుతోంది. ఈ విషయంపై తాజాగా మాట్లాడాడు ఓపెనర్ రోహిత్ శర్మ. మహిళా క్రికెటర్లు సృతి మంధాన, జెమీమా రోడ్రిగ్జ్‌తో జరిగిన లైవ్ చాట్ సెషన్లో ఈ విషయాలను పంచుకున్నాడు.
"ఐసీసీ టోర్నీల్లో టీమిండియా.. ముంబయి ఇండియన్స్‌లా ఆడాలి. ఐపీఎల్లో మా జట్టు పరాజయాలతో ప్రారంభించినా, విజయాలతో టోర్నీని ముగిస్తుంది. ఇదే తరహాలో భారత్.. తమ ఆటతీరును మెరుగుపర్చుకోవాలి"
-రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసాంతం టీమిండియా ఆకట్టుకున్నా, ఫైనల్లో పాకిస్థాన్‌పై ఓడిపోయింది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ మొదటి నుంచి అద్భుతంగా ఆడి, సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తయింది.
ఐపీఎల్ ముంబయి ఇండియన్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు రోహిత్. ఇతడి కెప్టెన్సీలోనే నాలుగుసార్లు విజేతగా నిలిచిందీ జట్టు. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన 13వ సీజన్‌ను నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ.
ఇదీ చూడండి : జట్ల భవిష్యత్తుపై ఆన్లైన్లో కోచ్‌ల చర్చ