ఐదేళ్ల వయసులో పోలియోతో అతడి కుడిచేయి శక్తిని కోల్పోయింది. కానీ ఆ చేతితోనే అద్భుతాలు సృష్టించాడు.. వైకల్యాన్ని వరంగా మార్చుకుని బంతిని గింగిరాలు తిప్పించాడు.. విదేశాల్లో మ్యాచ్‌లు గెలవడం మొదలెట్టిన జట్టుకు అదనపు బలంగా మారి మరపురాని విజయాలు అందించాడు.. తన మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థి జట్లను ఆటాడుకున్నాడు.. ఇది చదువుతుంటే సినిమా కథలా అనిపిస్తోంది కదూ! కానీ ఇది సినిమాను తలతన్నే ఓ నిజజీవిత గాథ. తన జీవితంలో కమ్ముకున్న చీకట్లకు వెలుగు దారి చూపించిన ఓ ధీరుడి పోరాట యాత్ర. అతనే భారత స్పిన్ దిగ్గజం భగవత్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. గొప్ప స్పిన్నర్‌గా చరిత్రలో నిలిచిపోయిన అతని జీవితం ఓ స్ఫూర్తి పాఠం.. నేటి తరానికి ఆదర్శం.
అందరి జీవితం ఒకేలా ఉండదు.. కానీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా వాటిని దాటుకుంటూ ముందుకు సాగుతూ విజయతీరాలను ముద్దాడడమే వీరుడి లక్షణం. ఆటుపోట్లను తట్టుకుంటూ.. నిరాశ, నిస్పృహలను తరిమేస్తూ.. ఆత్మవిశ్వాసం అండగా.. అనుకున్నది సాధించాలనే తపనతో తన నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ గెలుపు బాటలు వేసుకోవడమే యోధుడి కర్తవ్యం. చంద్రశేఖర్ అదే చేశాడు. చిన్నతనంలోనే పోలియోతో దెబ్బ తిన్న అతను దేశం గర్వించే క్రికెట్ దిగ్గజంగా ఎదగడం మామూలు విషయం కాదు కదా!
స్పిన్నర్‌గా మారి..:
1945 మే17న మైసూర్‌లో పుట్టిన చంద్రశేఖర్.. ఐదేళ్ల వయసులో పోలియో బారిన పడ్డాడు. మామూలుగా అందరిలోనూ కుడి చేతికే ఎక్కువ బలం ఉంటుంది. అలాంటిది ఆ చేయి పడిపోయేసరికి ఏం చేయాలో అతడి తల్లిదండ్రులకు అర్థం కాలేదు. బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ చంద్రశేఖర్ డీలా పడిపోలేదు. తన ఎడమ చేతిని నమ్ముకున్నాడు. దాంతోనే టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడేవాడు. అయితే అతని కుడిచేయికి బలం తెప్పించేందుకు వివిధ పద్ధతుల్లో చికిత్స అందించారు. దీంతో పరిస్థితి కాస్త మెరుగైంది. అయినప్పటికీ ఎడమ చేతి కంటే బలంగా మాత్రం మారలేదు. ఆ తర్వాత వారి కుటుంబం బెంగళూరుకు మకాం మార్చింది. అక్కడే తొలిసారి క్రికెట్ ఆడడం మొదలెట్టిన అతడు.. తన కుడి చేతితో మాయ చేయడం మొదలెట్టాడు. బంతిని స్పిన్ చేయడానికి వివిధ బౌలింగ్ శైలుల్ని ప్రయత్నించాడు. చివరకు మణికట్టు స్పిన్నర్‌గా మారి సంచలన ప్రదర్శనతో సత్తా చాటి టీమ్‌ఇండియా తలుపు తట్టాడు. ఫాస్ట్‌బౌలర్‌ను పోలిన రనప్‌తో.. వేగవంతమైన బౌలింగ్ శైలితో లెగ్ స్పిన్‌ను ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌పైకి ప్రయోగిస్తూ వికెట్లు రాబట్టాడు. గూగ్లీలతో హడలెత్తించాడు. బిషన్ సింగ్, ప్రసన్న, వెంకటరాఘవన్ లాంటి దిగ్గజ స్పిన్ త్రయంతో పోటీపడీ మరీ చంద్రశేఖర్ 58 టెస్టుల్లో 242 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో భారత్ చారిత్రక విజయాలు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ఇంగ్లాండ్ గడ్డపై..:
1964లో జట్టులో అడుగుపెట్టిన చంద్రశేఖర్.. 1971లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో తొలిసారి టెస్టు సిరీస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. చివరిదైన మూడో టెస్టుకు ఓవల్‌లో రంగం సిద్ధమైంది. గత 26 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని ఇంగ్లాండ్ ఓ వైపు.. ఈ మ్యాచ్‌లో నెగ్గి ఇంగ్లీష్ గడ్డపై తొలి టెస్టు సిరీస్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో టీమ్‌ఇండియా మరోవైపు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 355 పరుగులు చేసింది. చంద్రశేఖర్ రెండు వికెట్లు తీశాడు. బదులుగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులు చేయగలిగింది. 71 పరుగుల ఆధిక్యం సాధించిన ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలనుకుంది. కానీ ఒక్క రోజులోనే కథంతా మారిపోయింది. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులకే కుప్పకూలింది. దానికి కారణం.. చంద్రశేఖర్ స్పిన్ మాయే. ఆరు వికెట్లతో విజృంభించాడతను. 173 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించిన టీమ్‌ఇండియా చరిత్రాత్మక విజయాన్నందుకుంది. ఆ తర్వాత 1976లో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకోవడంలోనూ చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించాడు. అతను, ప్రసన్న కలిసి మొత్తం 20కి 19 వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియాలో భారత్ తొలి టెస్టు విజయం సాధించిందంటే కారణం చంద్రశేఖరే. 1978లో మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 6/52 చొప్పున గణాంకాలు నమోదు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 1972లో అతనికి ఆ ఏడాది ఉత్తమ క్రికెటర్‌గా విజ్డెన్ అవార్డు దక్కింది.
పరుగుల కన్నా వికెట్లెక్కువ
బ్యాటింగ్ ఆర్డర్లో దిగువ వరుసలో దిగే టెయిలెండర్లకు ఎంత బ్యాటింగ్ రాకపోయినా.. కలిసొచ్చిన రోజుల్లో సాధించే పరుగులన్నీ కలిపితే కొన్నేళ్ల కెరీర్లో అవి కొన్ని వందలు అవుతుంటాయి. కానీ చంద్రశేఖర్ విషయంలో అలా జరగలేదు. పోలియో సోకిన అతడి చేయి బౌలింగ్‌లో అతడికి వరమైంది కానీ.. ఆ చేత్తో బ్యాటింగ్ మాత్రం చాలా కష్టమయ్యేది. అతనెప్పుడూ బ్యాటింగ్ మీద పెద్దగా దృష్టిసారించలేదు కూడా. 58 టెస్టుల్లో 80 ఇన్నింగ్స్‌లాడి అతను సాధించిన పరుగులు 167 మాత్రమే. సగటు కేవలం 4.07. కెరీర్లో అతడు సాధించిన పరుగుల కంటే వికెట్లు ఎక్కువ కావడం చిత్రం. చంద్రశేఖర్ 29.74 సగటుతో 242 వికెట్లు పడగొట్టడం విశేషం.