శ్రీలంకలోని హోమగామాలో దేశంలో కెల్లా అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలన్న ఆ దేశ ప్రభుత్వ ప్రతిపాదనను మాజీ కెప్టెన్ మహెళా జయవర్ధనే తప్పుబట్టాడు. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలనే సరిగా ఉపయోగించడం లేదని తెలిపాడు.
శ్రీలంక ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ బోర్డుతో కలిసి అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ఆదివారం ప్రకటన చేసింది. హోమగామ ప్రాంతంలో 26 ఎకరాల విస్తీర్ణంలో 60 వేల మంది వీక్షించే విధంగా నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది.
దీనిపై మాజీ క్రికెటర్ జయవర్ధనే స్పందిస్తూ.. "ప్రస్తుతం ఉన్న స్టేడియాల్లో అంతర్జాతీయ, దేశవాళీ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఎలాంటివి జరగడం లేదు. ఇలాంటి పరిస్థితిలో కొత్తవి అవసరమా?" అని ట్వీట్ చేశాడు.
మూడేళ్లలో పూర్తి
స్టేడియం నిర్మించే ప్రదేశాన్ని ఇప్పటికే ప్రభుత్వం నియమించిన బృందం సందర్శించింది. నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని నిర్మాణానికి దాదాపు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. శ్రీలంకలో ఇప్పటికే ఎనిమిది అంతర్జాతీయ స్టేడియాలు ఉన్నాయి.
ఇదీ చూడండి.. 'గాన గంధర్వులు'గా మారిన పాండ్యా సోదరులు