ప్రతిష్ఠాత్మక విజ్డెన్ ట్రోఫీ కోసం చివరిసారి పోటీపడుతున్నాయి ఇంగ్లాండ్-విండీస్ జట్లు. ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనే ఈ ట్రోఫీ ఆఖరిసారి కనిపించనుంది. ఈ సిరీస్ నెగ్గిన జట్టు దగ్గరే ట్రోఫీ జీవితకాలం ఉండిపోనుంది. ఎందుకంటే ఆ తర్వాత విజ్డెన్ ట్రోఫీకి రిటైర్మెంట్ ప్రకటించనున్నారు. ఇరుజట్లు వచ్చే ఏడాది నుంచి రిచర్డ్స్-బోథమ్ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. ఇప్పటికే ఈ మేరకు ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డులు ఓ నిర్ణయానికి వచ్చాయి.
1963లో ప్రారంభం...
విజ్డెన్ ట్రోఫీని 1963లో ప్రవేశపెట్టారు. విజ్డెన్ క్రికెటర్స్ ఆల్మనక్(విజ్డెన్) పుస్తకం 100వ ఎడిషన్ సందర్భంగా దీన్ని ప్రారంభించారు. ఆనాటి ట్రోఫీని లార్డ్స్‌లోని ఎమ్‌సీసీ మ్యూజియంలో ఉంచారు. అయితే 57 ఏళ్ల తర్వాత వెస్టిండీస్-ఇంగ్లాండ్ దిగ్గజాలు వివియన్ రిచర్డ్స్, ఇయాన్ బోథమ్ పేరిట దీని పేరు మార్చనున్నారు.
![New Richards-Botham trophy for future England-West Indies Test series](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8150807_1021_8150807_1595566326762.png)
"నిజంగా ఇది నాకు, నా మిత్రుడు ఇయాన్కు గొప్ప గౌరవం. చిన్నవాడిగా ఉన్నప్పటి నుంచి ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు పొందే క్రికెటర్‌గా ఎదగడానికి కారణం నేను ఆటపై చూపిన ప్రేమని ఇప్పుడు తెలుకున్నా. ఇంగ్లాండ్ వెళ్లి సోమర్సెట్ తరఫున ఆడే అవకాశం వచ్చినప్పుడు నేను కలిసిన మొదటి వ్యక్తి ఇయాన్ బోథమ్. ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం. జీవితాంతం మిత్రులుగానే ఉంటాం"
-వివియన్ రిచర్డ్స్
తాను ఆడిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో రిచర్డ్స్ ఒకరిగా పేర్కొన్నాడు బోథమ్. అతడు మంచి స్నేహితుడు అయినప్పటికీ మైదానంలో ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేదని అభిప్రాయపడ్డాడు. వివియన్‌ను ఔట్ చేస్తే ఓ అమూల్యమైన వికెట్ సాధించినట్లుగా ఫీలయ్యేవాడినని చెప్పుకొచ్చాడు బోథమ్. టెస్టుల్లో విండీస్ జట్టుతో తలపడటం అంత సులభం ఏమీ కాదన్న ఆయన.. ఇద్దరి పేర్ల మీద ట్రోఫీ పెట్టడం ఆనందంగా ఉందన్నాడు.
![New Richards-Botham trophy for future England-West Indies Test series](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8150807_42_8150807_1595567285436.png)
రిచర్డ్స్ 62.36 సగటుతో ఇంగ్లాండ్‌పై పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. విండీస్‌పై బోథమ్ 20 టెస్టులు ఆడి 61 వికెట్లు సాధించాడు. సగటు 35.18గా ఉంది.
విజ్డెన్ ట్రోఫీ ప్రారంభమయ్యాక ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య 27 సిరీస్‌లు జరిగాయి. ఇందులో 9సార్లు ఇంగ్లాండ్ ట్రోఫీ గెలవగా.. నాలుగుసార్లు డ్రాగా ముగించింది. గతేడాది జరిగిన సిరీస్‌లో గెలిచిన విండీస్ చివరిగా ట్రోఫీని కైవసం చేసుకుంది. నేడు ప్రారంభమయ్యే ఆఖరి టెస్టును డ్రా చేసినా.. గెలిచినా కప్పు విండీస్ దగ్గరే ఉండనుంది. 2022లో కరీబియన్ గడ్డపై రెండు టెస్టుల్లో తలపడనున్న ఇంగ్లాండ్.. వాటిని రిచర్డ్స్-బోథమ్ ట్రోఫీలో భాగంగా ఆడనుంది.
![New Richards-Botham trophy for future England-West Indies Test series](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/hussain_2407newsroom_1595561910_401.jpeg)