టీమ్‌ఇండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారాను అడ్డుకునేందుకు ఈసారి ప్రత్యేక వ్యూహాలు రచించాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. కోహ్లీసేనకు మిడిలార్డర్‌లో అతడెంతో కీలకమని వెల్లడించాడు. గత సిరీసులో అతడి ప్రదర్శనలు ఇంకా గుర్తున్నాయని పేర్కొన్నాడు.
భారత జట్టు 2018-19లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. 4 టెస్టుల సిరీసును 2-1తో కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై తొలిసారి ట్రోఫీ దక్కించుకుంది. ఆ సిరీసులో పుజారా 74.42 సగటుతో ఏకంగా 521 పరుగులు చేశాడు. మూడు శతకాలు బాదేశాడు. ఆఖరి టెస్టులో ద్విశతకం (193) చేజారింది. నిషేధం కారణంగా ఈ సిరీసులో వార్నర్, స్మిత్ ఆడలేదు.
"చివరి సిరీసులో పుజారా అద్భుతం. సమయం తీసుకొని ఆడతాడు. తన పరిధిలో ఉంటాడు. ఎక్కువగా ఏకాగ్రత కోల్పోడు. అప్పటిలాగే ఆడితే మాత్రం అతడిని అడ్డుకొనేందుకు మేం వ్యూహాలు రచించక తప్పదు. పిచ్ నుంచి ఆశించడానికేమీ లేదు. అందుకే మేం మా ఆయుధాలకు మరికొంత పదును పెట్టాలి. పరిస్థితులు ఈసారి ఆసీస్‌కు అనుకూలంగా ఉండొచ్చు. భారత్‌ను ఆపాలంటే పుజారా లాంటి ఆటగాళ్లను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రప్పించాలి. బహుశా ఈసారి వికెట్లు కాస్త బౌన్సీగా ఉండొచ్చు. మాకింకా మరికొన్ని అవకాశాలూ ఉన్నాయి" అని కమిన్స్ అన్నాడు.
ఇదీ చూడండి... అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్‌గా ఒసాకా