ఆ జులపాల కుర్రాడు వన్డేల్లో అడుగుపెట్టి అప్పటికీ ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు.. ఆడిందేమో 21 వన్డేలే.. అప్పటికే పాకిస్థాన్ మీద మెరుపు శతకం బాది ప్రపంచ క్రికెట్‌కు తన పేరును పరిచయం చేశాడు.. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడకపోవడం వల్ల అతనిది ఆరంభ శూరత్వమే అవుతుందేమోనని అంతా అనుకున్నారు. కానీ 2005, అక్టోబర్ 31న అతనాడిన మ్యాచ్ తన భవిష్యత్‌నే మార్చింది. ఆ ఇన్నింగ్స్.. అతడిలోని విధ్వంసకారుణ్ని బయటకు తెచ్చింది. టీమ్‌ఇండియాకు ఓ గొప్ప ఫినిషర్‌ను తయారు చేసి పెట్టింది. అతగాడి పేరు.. మహేంద్ర సింగ్ ధోని. శ్రీలంకపై అతను అజేయంగా చేసిన 183 పరుగుల ఇన్నింగ్స్ అత్యుత్తమ వాటిల్లో ఒకటిగా మిగిలిపోయింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2005లో భారత్, శ్రీలంక మధ్య ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా జైపుర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మూడో వన్డే ధోని మెరుపులకు సాక్ష్యంగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. సంగక్కర (138) శతకం సాయంతో నాలుగు వికెట్లకు 298 పరుగులు చేసింది. ఆ రోజుల్లో అది పెద్ద లక్ష్యమే. పైగా అవతలి వైపు చమిందా వాస్, దిల్హారా ఫెర్నాండో, మహరూఫ్ లాంటి పేసర్లకు తోడు స్పిన్ మాంత్రికుడు మురళీధరన్ భారత్‌ను కట్టడి చేసేందుకు సిద్ధమయ్యారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన సచిన్ ఈసారి తొలి ఓవర్లోనే వెనుదిరగడం వల్ల స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడు అడుగుపెట్టాడు ధోని. అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించిన తర్వాతే మైదానం వీడాడు. తనను మూడో స్థానంలో పంపిన కెప్టెన్ ద్రవిడ్ నమ్మకాన్ని నిలబెడుతూ.. 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 183 పరుగులు చేశాడు.
ఆ సిక్సర్‌తో మొదలు..
క్రీజులోకి వచ్చిన ధోని తొలి ఏడు బంతులు ఆడే వరకే ఓపిక పట్టాడు. ఎనిమిదో బంతిని కవర్స్ దిశగా సిక్సర్‌గా మలచి తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. అక్కడి నుంచి మొదలు ఇక బంతి బౌండరీకి వెళ్లడమే పనిగా పెట్టుకుంది. ఫీల్డర్లు ప్రేక్షకులైపోయారు. బౌలర్లు తలలు పట్టుకున్నారు. స్టాండ్స్‌లోని అభిమానులేమో కేరింతల్లో మునిగిపోయారు. బౌలర్ ఎవరన్నది చూడకుండా బంతిని ఉతకడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు మహి. ధోనీని ఆపేందుకు ఆటపట్టు.. 11వ ఓవర్లోనే మురళీధరన్‌కు బంతి అందించాడు. కానీ అతణ్ని ధోని లెక్కచేయలేదు. లాంగాఫ్‌లో ఫోర్‌తో (41 బంతుల్లో) అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత అతణ్ని ఆపడం అసాధ్యమైపోయింది.
సెహ్వాగ్ వికెట్ తీసిన ఆనందాన్నీ ప్రత్యర్థి బౌలర్లకు మిగల్చకుండా చెలరేగాడు. బ్యాక్‌ఫుట్‌పై నిలబడి స్ట్రెయిట్‌గా అతను కొట్టిన బంతి ఆగలేనట్లు అత్యంత వేగంతో బౌండరీని ముద్దాడినా.. తక్కువ ఎత్తులో వచ్చిన ఫుల్‌టాస్ బంతిని అమాంతం ఎత్తి డీప్ స్క్వేర్‌లెగ్‌లో సిక్సర్‌గా మలిచినా.. లెగ్‌సైడ్ పడ్డ బంతిని ఓ కాలు నేల మీద ఆనించి స్క్వేర్‌లెగ్ దిశగా అభిమానుల మధ్యలో పడేసినా.. వేగంగా దూసుకొచ్చిన బంతికి లాంగాన్ దిశగా గమ్యాన్ని చూపినా.. అదంతా ధోని మాయే. 21 ఓవర్లు ముగిసే సరికే జట్టు స్కోరు 150 దాటింది. 85 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు మహి. అప్పటికి శ్రీలంకపై అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్ అతనే.
నరం పట్టేసినా
అనూహ్యంగా స్పిన్ అయిన ఓ బంతిని వికెట్లకు తాకకుండా ఆడే ప్రయత్నంలో ధోని కుడి కాలు తొడ నరం పట్టేయడం వల్ల నొప్పితో బాధపడ్డాడు. అయినా బ్యాటింగ్ కొనసాగించాడు. శతకం తర్వాత తన జూలు మరింతగా విదిల్చాడు. అతడి ధాటికి జట్టు స్కోరు 29వ ఓవర్లోనే 200 దాటింది. మధ్యలో నొప్పి తీవ్రతరమవడం వల్ల సెహ్వాగ్‌ను రన్నర్‌గా పెట్టుకుని ఇన్నింగ్స్ కొనసాగించాడు. సెహ్వాగ్ వచ్చినప్పటికీ అతనికి ఎక్కువ పని పెట్టకుండా ధోని బౌండరీలు లాగించాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన వికెట్‌కీపర్‌గా అప్పటివరకూ ఉన్న గిల్‌క్రిస్ట్ (172) రికార్డును బద్దలుకొట్టిన అతను మరో 23 బంతులు మిగిలి ఉండగా.. సిక్సర్‌తో తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు. ఇప్పటికీ వన్డేల్లో మహి అత్యధిక స్కోరు అదే.
బ్యాట్స్‌మెన్: మహేంద్రసింగ్ ధోని
పరుగులు: 183 నాటౌట్
బంతులు: 145
బౌండరీలు: 15 ఫోర్లు, 10 సిక్సర్లు
ప్రత్యర్థి: 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపు
సంవత్సరం: 2005
ఇదీ చూడండి... 'కచ్చితంగా ఆ అనుభూతిని మిస్ అవుతాం!'